Telugu Updates
Logo
Natyam ad

ఎర్రజెండాతోనే కార్మిక సంక్షేమం సాధ్యం!

సిఐటియు ఆధ్వర్యంలో మంచిర్యాలలో మేడే వేడుకలు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: న్యాయమైన హక్కుల సాధన కోసం చికాగో అమరవీరులు సాగించిన పోరాటం నుండే ఎర్రజెండా పుట్టిందని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే ను పురస్కరించుకొని బుధవారం మంచిర్యాల సిఐటియు ఆఫీసు ఆవరణలో 138వ మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉద్యోగ సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ రంగు రాజేశం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా శ్రామికవర్గ ప్రజలు జరుపుకుంటున్న పండుగలలో మేడే పండుగ విశిష్టమైనదని పేర్కొన్నారు. సామాన్య జీవుల న్యాయ పోరాటానికి ప్రతిబింబంగానే మేడే ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. కష్టజీవులకు న్యాయమైన హక్కులు దక్కాల్సిన చోట.. పెట్టుబడిదారీ వర్గాలకు అనుకూలంగానే పాలకవర్గాలు చట్టాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మతం పేర సాగుతున్న రాజకీయాలు కార్మిక ఐక్యతను బలహీనపరచలేవని ఆయన పేర్కొన్నారు. చికాగో అమరవీరులు అందించిన పోరాట స్ఫూర్తితో నేటికాలపు ఉద్యోగులు, కార్మికులు ఉద్యమించి తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో పనిచేస్తున్న శ్రామిక జీవులు ఎర్రజెండా నాయకత్వంలో ఐక్య ఉద్యమాలకు పూనుకోవాలని కోరారు. మంచిర్యాల జిల్లాలో కార్మిక వర్గ పోరాటాలకి సిఐటియు నాయకత్వం వహిస్తున్నదని,  వివిధ వర్గాల శ్రమజీవులు సిఐటియుని బలోపేతం చేసి తమ హక్కులను దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. కార్మిక హక్కులను నిలబెట్టే వారికి, ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడే వారికే రాబోయే ఎన్నికల్లో కార్మిక సంఘాలు మద్దతునిస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మహేందర్, సింగరేణి ఎస్సి కె ఎస్ కుమార్ (మెడికల్ & హెల్త్) , లక్ష్మి, వెంకటలక్ష్మి, (ఆర్టీసీ బస్టాండ్ వర్కర్స్) బాపు, నర్సింహులు, భీమయ్య (హాస్టల్ వర్కర్స్), వెంకటేష్ (విద్యుత్) తదితరులు పాల్గొన్నారు.