Telugu Updates
Logo
Natyam ad

ఓటర్ల జాబితాలో విచిత్రం.?

ఇంటి నంబరు ఉంటే ఓటరు పేరు ఉండదు. ఓటరు పేరుంటే ఇంటి నంబరు ఉండదు.

పేరు 00. ఇంటి నంబరు. 00: ఓటర్ల జాబితాలో తాజాగా వెలుగులోకి వచ్చిన మరో లీల ఇది.

ఓటరు ఇంటి నెంబరు, పేరు బదులుగా సున్నాలు.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఇంటి నంబరు ఉంటే ఓటరు పేరు ఉండదు. ఓటరు పేరుంటే ఇంటి నంబరు ఉండదు. ఓటర్ల జాబితాలో తాజాగా వెలుగులోకి వచ్చిన మరో లీల ఇది. ఇప్పటి వరకు మరణించిన వారి పేర్లు రావడం, ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు ఉండటం వంటివే చూశాం. తాజాగా సున్నా (0)లతో కొందరు ఓటర్ల వివరాలు నమోదు కావడం చర్చనీయాంశంగా ఉంది. రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెల 30న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 4వ తేదీ ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితా విడుదల చేసింది. దీనిపై ఇప్పటికే పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వెళ్లాయి. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలోనూ ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

• మరణించిన వారి ఓట్ల వద్ద ‘డిలీటెడ్’గా నమోదు.

ఇప్పటికే ఓటరు జాబితాలో పెద్దసంఖ్యలో మరణించిన వారి పేర్లను గుర్తించామని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు వాటిని తొలగించటం సాధ్యం కాని నేపథ్యంలో.. త్వరలో విడుదల చేసే జాబితాలో వారి పేర్ల వద్ద ‘డిలీటెడ్’ అని నమోదు చేస్తామని స్పష్టం చేశారు. తాజాగా ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని ఓటర్ల జాబితాలో పెద్ద సంఖ్యలో తప్పులు వెలుగులోకి వచ్చాయి. ఓటరు, తండ్రి పేర్ల స్థానంలో సున్నాలు నమోదు చేశారు. పేర్లుంటే ఇంటి నంబర్ల వద్ద సున్నాలు నమోదు చేశారు. ఈ అంశంపై ఎన్నికల అధికారులను ‘ఆంజనేయులు న్యూస్” సంప్రదించగా కొన్ని నియోజకవర్గాల్లో సున్నాలు నమోదైనట్లు తమ దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి అధికారులను పంపి వాటిని సరిదిద్దుతామని వివరించారు.