Telugu Updates
Logo
Natyam ad

ప్రజలకు ఎలాంటి అసౌర్యం కలుగకుండా రక్షణ చర్యలు

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్డ్డులో గల మాతా శిశు ఆసుపత్రిని డి.సి.పి. భాస్కర్, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, ఎ.సి.పి. ప్రకాష్, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి హరీష్రజ్లతో కలిసి ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రి పరిసరాలు, ఆసుపత్రిలోని ఇన్పేషెంట్ల వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదిలో వరద ఉధృతి పెరుగుతుండటంతో ముందస్తు రక్షణ చర్యలలో భాగంగా మాతా శిశు ఆసుపత్రి నుండి రోగులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పేషెంట్ తో ఒక సహాయకుడిని అందించి జాగ్రత్తగా తరలించడం జరుగుతుందని, ఎవరు భయాందోళన చెందవద్దని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో అధికార యంత్రాంగం అహర్నిశలు పని చేస్తుందని, ప్రజల సహాయార్థం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలు సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.

అనంతరం క్యాతన్ పల్లి మున్సిపల్ పరిధిలోని సింగరేణి ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సందర్శించి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న పడకల వివరాలు తెలుసుకున్నారు. సింగరేణి సి& ఎండితో ఫోన్ లో మాట్లాడి వరద పరిస్థితుల దృష్ట్యా మాతా శిశు ఆసుపత్రి నుండి రోగులకు ప్రత్యామ్నాయంగా సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరుగుతుందని, ఒకవేళ ఆసుపత్రిలో పడకలు సరిపోని పక్షంలో సింగరేణి ఆసుపత్రిలోని పడకలు వినియోగించుకుంటామని తెలుపగా సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం సింగరేణి ఆసుపత్రిలో 70 పడకలు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రిలో పడకల కొరత ఉన్నట్లయితే సింగరేణి ఆసుపత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల తహశిల్దార్ రమేష్, మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్, వైద్య-ఆరోగ్యశాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.