Telugu Updates
Logo
Natyam ad

ఆగని అక్రమం.. చర్యలు శూన్యం..

బెల్లంపల్లి షంషీర్ నగర్ లో నిర్మించిన గదులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. రెవెన్యూ యంత్రాంగం అక్రమ కట్టడాలు కూల్చిన చోటే దర్జాగా మళ్లీ నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు ట్రాక్టర్లతో కూల్చివేసినప్పటికీ నిర్మాణాలు మళ్లీ యథావిధిగానే కొనసాగుతున్నాయి. అధికార యంత్రాంగం కబ్జాలు అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నా అవేమీ సత్ఫలితాలు ఇవ్వడం లేదు. పట్టణంలోని షంషీర్ నగర్ లో ప్రభుత్వ భూముల కబ్జాల పర్వం కొనసాగుతోంది. గతంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలు పూర్తి స్థాయిలో కూల్చివేశారు. ఆ సమయంలో పేదల ఇళ్లను నేలమట్టం చేశారు. ప్రస్తుతం కబ్జాలు కొనసాగుతున్న పట్టించుకునే వారే కరవయ్యారు. కన్నాల శివారులో సింగరేణి అప్పగించిన రూ. కోట్ల విలువైన భూములు ఇప్పటికే అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.

కబ్జా చేసి.. ప్రహరీ నిర్మించి..

పట్టణంలోని షంషీర్ నగర్ లోని సర్వే నంబరు 170లో దర్జాగా ఎకరం కబ్జా శీర్షికన ‘ఆంజనేయులు న్యూస్’లో గతంలో కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు మరుసటి రోజే అప్పటి తహసీల్దార్ కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు. మూడేళ్ల నుంచి ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఇటీవల ఇదే స్థలంలో రెండు షట్టర్లలో గదులు నిర్మించారు. దాదాపు పది గుంటల చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశారు. నిర్మాణ సమయంలోనూ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత మాత్రం తూతూమంత్రంగా నోటీసులు జారీ చేసి చేతులు ధులుపుకొన్నారు.

చదును చేసిన ఖాళీ స్థలం

నోటీసులు జారీ చేశాం.

-మధుసూదన్, తహసీల్దార్, బెల్లంపల్లి

షంషీర్ నగర్ లో అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశాం. పట్టణంలో ప్రభుత్వ భూములకు చర్యలు తీసుకుంటున్నాం. ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారైనా కేసులు నమోదు చేస్తాం. షంషీర్ నగర్ అక్రమ నిర్మాణాలపై నోటీసులకు సమాధానాలు రాకపోతే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములు కాపాడటానికి ప్రయత్నాలు ప్రారంభించాం. ప్రభుత్వ  స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టి నష్టపోవద్దు.