Telugu Updates
Logo
Natyam ad

పరీక్షలు చేసేవారేరి..?

మంచిర్యాలలో టీ-హబ్ ఇంకా నియామకాలు చేపట్టని వైనం

ప్రారంభానికి సిద్ధమైన జిల్లా కేంద్రంలోని టీ-హబ్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాలలో టీ-హబ్ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది. కానీ సిబ్బంది. నియామకమే ఇంకా పూర్తి కాలేదు. కీలక విభాగమైన ల్యాబ్ టెక్నీషియన్ల (ఎల్టీ) నియామకం ఊసే లేదు. జిల్లాలోని ఆసుపత్రుల్లో వీరి కొరత తీవ్రంగా ఉంది. ఒక్కొక్కరు రెండేసి ఆరోగ్యకేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అవేమీ పరిగణనలోకి తీసుకోకుండా పలు కేంద్రాల నుంచి ఏడుగురు ఎల్టీలను ఈ టీ- హబ్ లో విధులు కేటాయించారు. దీంతో ఇక్కడి సేవలకు సరే.. మరీ ఆయా ఆరోగ్యకేంద్రాల్లో పరీక్షలు ఎవరు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని జీజీహెచ్, ఎంసీహెచ్ తో పాటు అన్ని ఆరోగ్యకేంద్రాల్లో సరైన సదుపాయాలు లేవు. సౌకర్యాలు ఉన్న చోట సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రధానమైన పెద్దాసుపత్రి, మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలోనే యంత్రాలు సక్రమంగా పనిచేయడం లేదు. తరచూ మొరాయిస్తూ సేవలకు అంతరాయం కలిగిస్తున్నా.. గర్భిణులు అవస్థలు పడుతున్నా పట్టించుకునేవారు లేరు. పాతవాటికి మరమ్మతులు చేయించకుండా కొత్తవాటిపైనే దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. టీ-హబ్ లో ప్రస్తుతం నూతన యంత్రాలు అందుబాటులోకి రావడంతో పర్యవేక్షకులు వీటిని వినియోగంలోకి తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కేంద్రంతో మరిన్ని అధునాతన పరీక్షలు అందనుండగా పాత యంత్రాల నిర్వహణ సజావుగా జరిగితే బాధితులకు మెరుగైన సేవలు అందే అవకాశముంటుంది.

అందుబాటులోకి రానున్న నూతన యంత్రం

ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత..

టీ-హబ్ లో సిబ్బంది నియామకానికి గతనెలలోనే ప్రకటన ఇచ్చారు. అవసరమైన పాథాలజిస్టు, బయోకెమిస్ట్, మైక్రోబయాలజిస్టు, రేడియాలజిస్టు, ల్యాబ్ మేనేజర్, రేడియోగ్రాఫర్.. ఇలా ఆరు విభాగాలకు చెందిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ కేంద్రంలో కీలకంగా వ్యవహరించే ఎల్టీ (ల్యాబ్ టెక్నీషియన్)ల ఊసే లేదు. సంబంధిత అంశంపై నిర్వాహకులను వివరణ కోరితే రాష్ట్రవ్యాప్తంగా వీరి నియామకం లేదని, ఆయా జిల్లాలకు ఆరోగ్య కేంద్రాల ఎల్టీలనే వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు సూచించినట్లు చెబుతున్నారు. ఎల్టీలు సరిపడా, అధికంగా ఉన్న చోట నుంచి ఈ కేంద్రానికి ఉపయోగించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ జిల్లాలో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లోనే కొరత ఉండగా ఇక్కడి సేవలకు ఎలా కేటాయిస్తారనే సందేహాలు సంబంధితశాఖ ఉద్యోగుల్లోనే మొదలయ్యాయి. వీరిక్కడికొస్తే ఆయా ప్రాంతాల్లోని బాధితులకు రక్తపరీక్షలు ఎవరు చేస్తారనేది ప్రశ్నార్థకం. పర్యవేక్షకులు ఇక్కడ నెలకొన్న కొరతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తాత్కాలిక పద్ధతిలోనైనా కొంతమంది నియామకానికి అనుమతి ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముంది.

వివిధ ప్రాంతాల్లోని ఆరోగ్యకేంద్రాల నుంచి టీ-హబ్ కు కేటాయించిన ఎల్టీల వివరాలు ఇలా..

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి-1 (ఇక్కడ ఉన్నది ఒక్కరే.. శిక్షణ విద్యార్థులతో నెట్టుకొస్తున్నారు)

పీపీపీ యూనిట్-1(ఈ కేంద్రంలో సేవలందిస్తుంది ఒక్కరే.. అదనంగా ఇప్పటికే ఆర్టీపీసీఆర్ ల్యాబ్ లో సేవలు అందిస్తున్నారు)

యూపీహెచ్సీ రాజీవ్ నగర్-1(పేద, మధ్యతరగతి బాధితులు నిత్యం వందలాదిగా వచ్చే ఈ కేంద్రంలో ఉన్నది ఒక్కరే)