Telugu Updates
Logo
Natyam ad

ఎస్పీఎం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు కసరత్తు

ఆంజనేయులు న్యూస్, కాగజ్నగర్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్ల కాగజ్నగర్ సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలపై కార్మిక వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. మిల్లు పునఃప్రారంభమైన నాటినుంచి ఎన్నికలు నిర్వహించలేదు. ఇటీవలి పరిణామాలు కార్మికుల్లో మళ్లీ కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. ఎస్పీఎం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు కార్మికశాఖ అధికారులు అడుగులు వేస్తున్న తరుణంలో బరిలో ఎవరెవరు ఉండబోతున్నారనే విషయంపై చర్చించుకుంటున్నారు. మూతపడే సమాయానికి మిల్లులో ఉన్న 15 గుర్తింపు సంఘాలకు తమ సంవత్సర నివేదికలను అందజేయాలని డీసీఎల్ సునీత లేఖలు పంపించిన విషయం తెలిసిందే.ఆయా సంఘాలు తమ తమ నివేదికల తయారీలో నిమగ్నమయ్యాయి. ఈనెల 3వ తేదీలోగా ఆదిలాబాద్ లోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయంలో ఆయా కార్మిక సంఘాలు తమ సంవత్సర నివేదికలను అందజేయాల్సి ఉంది. ఓ వైపు నివేదికలు అందజేసేందుకు సిద్ధమవుతూనే మరో వైపు తమ సంఘం తరపున ఎవరిని బరిలో దింపాలనే దానిపై సైతం కార్మిక సంఘాలు కసరత్తు చేస్తున్నాయి. భాజపా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు భాజపా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో బీఎంఎస్ అభ్యర్థిపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బీఎంఎస్ అధ్యక్షులుగా భట్టాచార్య కొనసాగుతున్నారు. సిర్పూర్ పేపర్ మిల్ ఎంప్లాయిస్ యూనియన్ తరపున భాజపా ఎంపీ రఘునందన్ రావు బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఎస్పీఎం ఎంప్లాయిస్ ప్రొటెక్షన్ యూనియన్ తరపున భారాస రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో ఉండబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. మరో వైపు అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచే అభ్యర్థి ఎవరనేదానిపై ఆ పార్టీ శ్రేణుల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో ఐఎన్టీయూసీ పక్షాన నిలిచేదెవరనేది కార్మికులు చర్చించుకుంటున్నారు. మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కార్మిక సంఘాలు బరిలో నిలిచి గెలిచే అభ్యర్థి కోసం కసరత్తు చేస్తున్నాయి. కార్మికశాఖ తుది చర్యలు చేపట్టి ఎన్నికల నిర్వహణ విధివిధానాల ప్రకటించిన అనంతరం బరిలో నిలిచేదెవరనేది పూర్తి స్పష్టత రానుంది.