Telugu Updates
Logo
Natyam ad

సొసైటీ ముసుగులో అక్రమాలెన్నో.

దాదాపు రూ. రెండు కోట్లు మోసగించినట్లు అంచనా

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: కోఆపరేటివ్ సొసైటీ ముసుగులో రైతులకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టిన కేసులో మరిన్ని అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో ‘ఆర్కే రూరల్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’ పేరిట ఏర్పాటు చేసిన కార్యాలయం ద్వారా రైతులకు వ్యక్తిగత రుణాలు ఇస్తామంటూ వారి నుంచి రూ. లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసగించినట్లు బజార్హథ్నూర్ చెందిన బాధితుడు ఆదిలాబాద్ టూటౌన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన కొండూరి రాకేందర్(చైర్మన్), రాగం రమేష్ (మేనేజర్), ఈదాం హన్మంతు(ఫీల్డ్ అసిస్టెంట్), కాంబ్లే ఆకాష్(కార్యాలయక్లర్క్) లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో వీరి బారిన పడి మోసపోయిన బాధితులు మరికొంత మంది సైతం పోలీసులకు ఫిర్యాదు చేయటానికి ముందుకు వస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఆర్కే రూరల్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’ పేరుతో ప్రారంభించిన కార్యాలయానికి నిర్వాహకులు ఆదిలాబాద్ పట్టణంలోనే మరో బ్రాంచిని ఏర్పాటు చేశారు. సొసైటీ నిర్వాహకులు రైతుల వద్దకు వెళ్లి కొంత సొమ్ము చెల్లిస్తే దానికి రెండింతలు వ్యక్తిగత రుణాలు ఇస్తామని, కేవలం రూ.55 వేలు చెల్లిస్తే ద్విచక్రవాహనాలు ఇప్పిస్తామని పలువురి వద్ద డబ్బులు వసూలు చేశారు. రూ.55 వేలు చెల్లిస్తే రూ. లక్ష విలువైన ద్విచక్రవాహనం ఇప్పిస్తామని, మిగతా డబ్బు వడ్డీ లేకుండా వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుందని నమ్మించి ఎంతో మంది వద్ద రూ.55 వేల చొప్పున వసూలు చేసి వాహనాలు ఇప్పించారు. అయితే సొసైటీ నిర్వాహకులు ఫైనాన్స్ కంపెనీలకు రూ.20 వేలు మాత్రం చెల్లించి వాహనాలను రుణ ప్రాతిపదికన ఇప్పించారు. ప్రస్తుతం వాయిదాలు చెల్లించాలని ఫైనాన్స్ వారు రావటంతో జరిగిన మోసం బాధితులకు తెలిసింది. ఇలా ఎంతో మందిని మోసం చేసినట్లు సమాచారం. అదే విధంగా సొసైటీ ద్వారా జిల్లాలోని పలు ఎరువులు, క్రిమిసంహారక విక్రయ కేంద్రాల్లోనూ రైతులకు రుణ ప్రాతిపదికన వాటిని ఇప్పించారు. కానీ ఆ డబ్బులను మాత్రం ఆ విక్రయ కేంద్రాలకు చెల్లించలేదు. ఇలా దాదాపు రూ.2 కోట్ల వరకు ఆ సొసైటీ మోసం చేసిందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఆయా ప్రాంతాల్లో ఇలా..

ఆ సొసైటీ వారు ఆదిలాబాద్ జిల్లాలోని బేల, తలమడుగు, గుడిహత్నూర్, ఇచ్చోడ, బజార్హత్నూర్తోపాటు నిర్మల్ జిల్లాలోనూ ఇలా రైతులను మోసం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాధితులు పోలీసులను ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.