Telugu Updates
Logo
Natyam ad

పాప ప్రాణాలు కాపాడిన ప్రజావాణి

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌ జియాగూడకు చెందిన ఓ నిరుపేద కుటుంబంలో నాలుగు నెలల పసికందుకు ఆరోగ్యం బాగుండకపోవడంతో పలు హాస్పిటల్‌లో పరీక్షలు చేయించారు. చిన్నారి గుండెకు రంధ్రం ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆపరేషన్ చేయించాలంటే లక్షలతో కూడిన వ్యవహారం. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకోవా లన్నా రేషన్‌ కార్డులో చిన్నారి పేరు ఉండాలి. ప్రైవేటులో రూ.లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతో రెక్కాడితే కాని డొక్కాడని ఆ కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. ఈ క్రమంలో బిడ్డతో సహా తల్లి సునీత మంగళవారం ఉదయం ప్రజా భవన్‌కు వచ్చి.. నోడల్‌ అధికారిణి దివ్యను కలిశారు. తన చిన్నారి సమస్యను అధికారికి విన్నవించారు. సమస్య వినగానే నోడల్ అధికారిణి దివ్య వెంటనే స్పందించారు. అక్కడే ఉన్న డాక్టర్లకు శిశువు బాధ్యతలు అప్పగించారు. చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, వెంటనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించాలని బంజారాహిల్స్‌లోని స్టార్‌ ఆసుపత్రికి సమాచార మిచ్చారు. తల్లీబిడ్డలను వైద్యుల పర్యవేక్షణలో ప్రజా భవన్‌లోనే ఉన్న అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. ఈ నిర్ణయంతో తల్లి సునీత, ప్రజాభవన్‌లో వినతి పత్రాలు సమర్పించేందుకు వచ్చిన వారంతా హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వమంటే ఇలా ఉండాలని.. కష్టమని వస్తే తక్షణమే సాయం చేసేలా వ్యవస్థలు ఉండాలని ప్రజలు అంటున్నారు.