Telugu Updates
Logo
Natyam ad

రూ.350 కోట్ల మద్యం డొంక కదులుతోందా..?

బెడిసికొడుతున్న నాయకుల ముందస్తు ప్రణాళిక

పది రోజుల్లోనే రూ.8.7 కోట్ల సరకు స్వాధీనం

ఎన్నికల కమిషన్ ఆదేశాలతో తనిఖీలు ముమ్మరం

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఒక్కరోజే రూ.1.42 కోట్ల విలువైన అనధికారిక మద్యం పట్టుబడింది. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తరువాత పది రోజుల్లో ఏకంగా రూ. 8.7 కోట్ల సరకును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో మద్యం డంపుల డొంక కదులుతున్న తీరుకు ఈ గణాంకాలే నిదర్శనం. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆబ్కారీశాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఉరుకులు పరుగులు పెడుతుండటంతో గుట్టుగా సాగిన దందా బహిర్గతమవుతోంది. ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు రాష్ట్రంలో భారీగా మద్యం నిల్వ చేశారనే ఫిర్యాదుల నేపథ్యమే ఈ పరిణామాలకు కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 50 వేలకు పైగా బెల్ట్ షాపుల ద్వారా అనధికారిక మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న అంచనాల నేపథ్యంలో ఎన్నికలు ముగిసేలోపు ఇంకా ఎన్ని రూ. కోట్ల మద్యం బయటపడుతుందనే చర్చ ఆబ్కారీశాఖలో జోరందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబరు మొదటివారంలో మద్యం వ్యాపారులకు ఆబ్కారీశాఖ అనధికారికంగా బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎన్ని రూ. కోట్ల మద్యం బయటపడుతుందనే చర్చ ఆబ్కారీశాఖలో జోరందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబరు మొదటివారంలో మద్యం వ్యాపారులకు ఆబ్కారీశాఖ అనధికారికంగా బంపర్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్టేటెడ్ చెక్కులిచ్చి ఎంతైనా సరకు తీసుకెళ్లొచ్చని చెప్పింది. వాస్తవానికి వ్యాపారులు డిపోల నుంచి మద్యం తీసుకెళ్లాలంటే ముందస్తుగా డీడీ రూపంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అనూహ్యంగా ఆఫర్ ప్రకటించడంతో ఇదే మంచి అవకాశంగా భావించి వ్యాపారులు భారీ మొత్తంలో మద్యాన్ని తీసుకెళ్లారు. దాదాపు రూ.350 కోట్ల సరకు తరలించినట్లు సమాచారం. ఇందులో ఎక్కువగా రాజకీయ నాయకులు డంపుల్లోకే చేరిందనే ప్రచారం ఉంది. ఈ తతంగమంతా ఆబ్కారీశాఖలో కొందరు అధికారులకు తెలిసే జరిగిందనే ఆరోపణలున్నాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తే అధికారికంగా భారీ మొత్తంలో మద్యాన్ని కొనుగోలు చేయడం కుదరదనే ఉద్దేశంతోనే ఇలా ముందస్తు మందు ప్రణాళిక వేశారనే చర్చ జరిగింది. దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతో ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆబ్కారీశాఖ డైరెక్టర్ ముషారఫ్ అలీపై వేటు వేశారనే ప్రచారం జరిగింది. శాఖ కమిషనర్గా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న బుద్ధప్రకాశ్ జ్యోతి ఆదేశాలతో ఎస్టీఎఫ్, డీటీఎఫ్ బృందాలు మద్యం వేటలో నిమగ్నమయ్యాయి. దీంతో పోస్ట్ డేటెడ్ చెక్కులతో లిఫ్ట్ చేసిన సరకులో దాచిందెంతో తేలుతుందా..? అనే ఉత్కంఠ నెలకొంది.