Telugu Updates
Logo
Natyam ad

ప్రధాని మోదీపై.. పాకిస్థాన్ మీడియా ప్రశంసల జల్లు

అంతర్జాతీయ వేదికపై భారత్ కు పెరుగుతోన్న పరపతిపై పాకిస్థాన్ మీడియా ప్రశంసలు కురిపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోనే ఇది సాధ్యమవుతోందంటూ ప్రత్యేక వ్యాసంలో పేర్కొంది.

ఆంజనేయులు న్యూస్, ఇస్లామాబాద్: కొంతకాలంగా అంతర్జాతీయ వేదికపై భారత్ తన సత్తా చాటుతున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ మీడియా కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ అంతర్జాతీయంగా తన పలుకుబడిని పెంచుకోవడంతోపాటు ఎన్నో అంశాల్లో ప్రభావం కూడా చూపుతోందని ప్రశంసించింది. ఇలా విస్తృత అంశాల్లో భారత్ తన ప్రభావాన్ని పెంచుకోవడం మోదీ నాయకత్వంలోనే సాధ్యమైందంటూ పొగడ్తలు కురిపించింది. అన్ని రంగాల పెట్టుబడులకు భారత్ ను స్వర్గధామంగా తీర్చిదిద్దారని పేర్కొంటూ అక్కడి ప్రముఖ రాజకీయ, భద్రతా, రక్షణ అంశాల విశ్లేషకుడు షెహజాద్ చౌద్రీ పాకిస్థాన్ లో ప్రముఖ పత్రిక ది ఎక్స్ప్రెస్ ట్రైబ్యూన్ కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఎంతో నైపుణ్యంతో విదేశీ విధానాన్ని కొనసాగిస్తున్నారని, తద్వారా దేశ జీడీపీ 3 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని చెప్పారు. విదేశీ విధానంలో భారత్ తనకంటూ ప్రత్యేక స్థానం, పరిధిని ఏర్పరచుకుందన్న ఆయన.. వ్యవసాయ ఉత్పత్తులు, ఐటీ రంగంలో అతిపెద్ద ఉత్పత్తిదారుగా నిలిచిందని గుర్తుచేశారు. భారత్ లో ప్రతి ఎకరాకు వచ్చే దిగుబడి కూడా ప్రపంచంలోనే ఉత్తమమైందన్నారు. 140 కోట్ల జనాభా ఉన్నప్పటికీ స్థిరమైన, ప్రయోజనకరమైన విధానాలను అనుసరిస్తోందని చెప్పారు. ప్రతికూల సమయాల్లోనూ భారత్ పాలనా వ్యవస్థ తట్టుకొని నిలిచిందని.. తద్వారా బలమైన ప్రజాస్వామ్య దేశమని నిరూపించుకుందని ఉద్ఘాటించారు. భారత్ కు పేరు ప్రఖ్యాతలు తేవడంలో గతంలో ఎవ్వరూ చేయని పనిని మోదీ చేశారని ప్రశంసించారు. అంతకుముందు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా భారత్ విదేశాంగ విధానంపై పొగడ్తలు కురిపించిన సంగతి తెలిసిందే.