Telugu Updates
Logo
Natyam ad

నకిలీ విత్తనాలను అరికట్టడంలో క్షేత్రస్థాయిలో పటిష్టమైన చర్యలు

జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వ్యవసాయరంగ అభివృద్ధి, రైతు సంక్షేమం, భూకమతాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం పని చేస్తుందని, జిల్లాలోని నకిలీ విత్తనాలను అరికట్టడంలో క్షేత్రస్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులతో పంటల సాగు, నకిలీ విత్తనాల నియంత్రణ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి మండల విస్తరణాధికారులు వారి పరిధిలో ఉన్న భూ కమతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ వ్యవసాయ రంగంలో రైతులకు తగిన మెళకువలు అందించడంలో విధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నకిలీ విత్తనాల నియంత్రణపై అధికారులు క్షేత్రస్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ క్రమంలో వ్యవసాయ అధికారులు విధులు సమర్థవంతంగా నిర్వహించాలని, పంటలు, ఫర్టిలైజర్ షాపులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, స్టాక్ నిల్వల రిజిస్టర్లు, స్టాక్ నిల్వలను పరిశీలించాలని, ఎలాంటి తేడా లేకుండా చూడాలని, పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫర్టిలైజర్స్ లో నిబంధనలకు విరుద్దంగా నిషేధిత ఎరువుల నిల్వలు కలిగి ఉన్నా, నిర్ణీత ధరకు మించి అధిక ధరలకు విక్రయించినా, రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా లేకపోయినా నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అలసత్వం, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన తీసుకోవడంతో పాటు సస్పెండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, మండల వ్యవసాయ అధికారులు, మండల విస్తరణ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.