Telugu Updates
Logo
Natyam ad

రాష్ట్రపతి మహిళ అయితే.. ఎలా సంబోధించాలి?

నాడు రాజ్యాంగ సభలోనూ చర్చ

దిల్లీ: మన దేశాధినేత మహిళ అయితే ఏమని పిలవాలి.. ఈ ప్రశ్న ఇప్పుడే కాదు రాజ్యాంగం అమల్లోకి రాకముందే ఉత్పన్నమయ్యింది. ప్రతిభా పాటిల్ ‘రాష్ట్రపతి’గా ‘ ఎన్నికైనప్పుడు తొలుత కొద్ది రోజుల పాటు చర్చ సాగింది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బ్రిటిష్ సంప్రదాయం ప్రకారమే ‘గవర్నర్ జనరల్ వ్యవస్థ కొనసాగింది. 1950 జనవరి 26వ తేదీ నుంచి దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు నుంచే రాష్ట్రపతి పదవి ఉనికిలోకి వచ్చింది.

అంతకు ముందు రాజ్యాంగ సభలో ‘రాష్ట్రపతి’ సంబోధన అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మహిళ ఆ పదవిని చేపట్టాల్సి వస్తే ‘రాష్ట్రపతి’గా పిలవడం సరికాదని… ‘నేత’ అని సంబోధించాలని రాజ్యాంగ సభ సభ్యుడు కె.టి. షా అభిప్రాయపడ్డారు. మరికొందరు ‘కర్ణధార్’ (కెప్టెన్)గా, సర్దార్ పిలవాలని సూచించారు. అయితే, ఆంగ్లంలో సిద్ధం చేసిన రాజ్యాంగ ప్రతిలో … ఈ హోదాను ‘ప్రెసిడెంట్’గా, హిందీ ప్రతిలో ‘ప్రధాన్’గా, ఉర్దూ ప్రతిలో ‘సర్దార్’గా పేర్కొన్నట్లు డా.బి.ఆర్. అంబేడ్కర్ గతంలో ఓ సందర్భంలో తెలిపారు. పురుషుడైనా, మహిళైనా ఆ పదవికి ఎన్నికైన వారిని ‘రాష్ట్రపతి’గానే పిలవాలని తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నిర్ణయించారు. జాతీయోద్యమ కాలంలో కాంగ్రెస్ అధ్యక్షుడిని రాష్ట్రపతిగా సంబోధించేవారు.