ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
బతుకమ్మను పేర్చడం ఓ కళ. అలంకారినికో పరీక్ష. సౌందర్యాభిలాషకో నిదర్శనం. బతుకమ్మను పేర్చేవారికి పూల పరిచయముండాలి. రంగుల రహస్యం తెలుసుండాలి. అద్దకం, కలంకారి పనితనం కావాలి. అందరికీ రాదు ఆ విద్య.
ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: పూల పండుగతో తెలంగాణ పులకించింది. ఆడపడుచుల ఆనందం ఉప్పొంగింది. గౌరమ్మను కొలిచి సౌభాగ్యాలివ్వమని వేడుకుంది. సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఊరూ వాడా మహిళలు రంగు రంగుల పూలను పేర్చి సద్దుల బతుకమ్మను తయారు చేశారు. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను చాటే సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. అనంతరం మహిళలందరూ ఒకచోట చేరి ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ శ్రావ్యంగా పాడుతూ ఆడుతూ మహిళలు సందడి చేసి గంగమ్మ ఒడికి బతుకమ్మలను చేర్చారు.