Telugu Updates
Logo
Natyam ad

నూతన ఆర్.ఓ.ఆర్. చట్టం ముసాయిదాపై అందించిన సూచనలను ప్రభుత్వానికి నివేదిస్తాం.

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్.ఓ.ఆర్. చట్టం ముసాయిదాపై నిపుణులు, మేధావులు, విశ్రాంత రెవెన్యూ అధికారులు అందించిన సూచనలు, సలహాలు ప్రభుత్వానికి నివేదించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నూతన ఆర్.ఓ.ఆర్. చట్టం ముసాయిదాపై విశ్రాంత రెవెన్యూ అధికారులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, నిపుణులతో ఏర్పాటు చేసిన చర్చ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు రాములు, హరికృష్ణ, భూ సేకరణ ప్రత్యేక అధికారి చంద్రకళ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్. ఓ. ఆర్. ముసాయిదా బిల్లుపై నిపుణులు అందించిన ప్రతి సలహాను సి.సి.ఎల్.ఎ. కు నివేదించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం కొరకు నూతన చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, దేశంలోని వివిధ రాష్ట్రాలలో అమలు జరుగుతున్న భూ రికార్డులు, నిర్వహణ పద్ధతులను పరిశీలించిన నిపుణుల బృందం నూతన ఆర్.ఓ.ఆర్. చట్టం ముసాయిదా బిల్లును రూపొందించిందని తెలిపారు. నూతన చట్టం రూపకల్పనలో ప్రజలను భాగస్వామ్యులను చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్చ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, భూ రికార్డుల నిర్వహణకు మెరుగ్గా ఉండే విధంగా ముసాయిదా బిల్లుపై రైతు సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు తమ సలహాలు,  సూచనలను వ్రాతపూర్వకంగా కలెక్టరేట్ కార్యాలయంలో అందించినట్లయితే వాటిని ఒక నివేదిక రూపంలో తయారుచేసి సి.సి.ఎల్.ఎ. కు అందిస్తామని తెలిపారు.

ఈ క్రమంలో విశ్రాంత తహసిల్దార్లు, పలువురు మేధావులు, న్యాయవాదులు, రైతు సంఘాల నాయకులు తమ సలహాలను, సూచనలను వెల్లడించారు. భూ సేకరణలు, వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూములను గుర్తించి మండల రెవెన్యూ కార్యాలయ స్థాయి, రెవెన్యూ డివిజనల్ స్థాయిలలో పరిష్కరించే వాటిని త్వరగా పూర్తి చేయాలని, ఆంధ్రప్రదేశ్ పాస్ పుస్తకాలు ఉన్న రైతుల స్థానంలో తెలంగాణ పాస్ పుస్తకాలు ఇవ్వాలని, ధరణి పోర్టల్ పేరును భూదేవి / భూమాతగా మార్చాలని, నోషనల్ పట్టా సమస్యలు పరిష్కరించాలని, వ్యవసాయేతర భూముల కేసులకు సంబంధించి చెల్లించిన చలాన్ తిరిగి ఇవ్వడం, పట్టాదారు మృతి చెందినట్లయితే వారసత్వ భూముల బదలాయింపులో ప్రక్రియ వేగవంతం చేయడం, పోర్టల్ ఉపయోగించేందుకు ఒక ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందించడం, రెవెన్యూ కార్యాలయాలలో క్రమం తప్పకుండా ఆడిట్ ప్రక్రియ నిర్వహించడం చేయాలని సూచించారు. గ్రామాలలో ఆబాది భూముల రికార్డులను ఆధునీకరించడం, సాదా బైనమా, భూముల రిజిస్ట్రేషన్ రుసుము వసూలు చేయడం, అనుభవదారుడి కాలమ్ ఉండడం, అప్పీల్ అథారిటీ రాజస్వ మండల అధికారికి ఉండాలని, నూతన చట్టం అమలుకు ప్రతి గ్రామానికి రెవెన్యూ ఉద్యోగి ఉండే విధంగా చర్యలు తీసుకోవడం, భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో అప్పిలేట్ అథారిటీ ఉండేవిధంగా చర్యలు తీసుకోవడం, ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనుల హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చట్టాన్ని రూపొందించడంపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన చట్టం ముసాయిదా బిల్లు పై అందించిన సూచనలు, సలహాలను పూర్తి వివరాలతో నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత తహసిల్దార్లు, రెవెన్యూ అధికారులు, న్యాయవాదులు, రైతు సంఘాల నాయకులు, రైతులు, నిపుణులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.