Telugu Updates
Logo
Natyam ad

నాన్నా.. నన్ను కాపాడు’ అన్న కాసేపటికే..

తండ్రితో చివరి మాటలు చెప్పి జ్వరంతో మృత్యువాతపడ్డ విద్యార్థిని

ఆంజనేయులు న్యూస్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఉన్నత చదువుల కోసం కన్న పేగును ఇంటికి దూరంగా వసతిగృహంలో చదివించేందుకు పంపిన ఆ తల్లిదండ్రులకు కడుపు కోతే మిగిలింది. ఎలాగైనా నన్ను కాపాడు నాన్నా.. అంటూ తండ్రికి చివరి మాటలు చెప్పి ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన శనివారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కౌటాల మండలం గుండాయిపేట గ్రామానికి చెందిన జాడె కిషోర్-సురేఖ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె పూజ(17) ఆసిఫాబాద్ లోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల వసతిగృహంలో ఉంటూ పదో తరగతి చదువుతోంది. జ్వరంతో బాధపడుతుండటంతో.. గత శనివారం కుటుంబీకులు ఆమెను స్వగ్రామానికి తీసుకువచ్చారు. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీల వద్ద వైద్యమందించారు. శుక్రవారం సాయంత్రం తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురికావడంతో కుటుంబీకులు హుటాహుటిన మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శనివారం మధ్యాహ్నం పూజ ఆరోగ్యం క్షీణించడంతో. కుటుంబీకులు హైదరాబాద్ కు తరలిస్తున్న క్రమంలో మార్గ మధ్యలో మృతిచెందింది. గామంలో అందరితో కలివిడిగా ఉండే పూజ మరణంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

• భయాందోళనలో గ్రామస్థులు..!

కొన్ని రోజులుగా గుండాయిపేట గ్రామంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. తీవ్ర జ్వరాలతో పాటు కీళ్లనొప్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా పూజ మృతివార్తతో వారంతా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు తీవ్ర జ్వరాలతో మంచిర్యాల, కరీంనగర్ పట్టణాల్లోని ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. వైద్యాధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు గ్రామంలో ఇంటింటా వైద్య పరీక్షలు చేసి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.