Telugu Updates
Logo
Natyam ad

మంత్రి పీఏ అని చెప్పి.. గురుకులాల్లో అక్రమ దందా

ఆంజనేయులు న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే తల్లి తండ్రుల ఆశలను కొందరు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రిన్సిపల్ తో కుమ్మకై రూ.20 వేల నుంచి రూ.40 వేల చొప్పున వసూలు చేసి గురుకులాల్లో పిల్లలకు ప్రవేశం కల్పిస్తున్నారు. ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన ఓ నేత మంత్రి సీతక్కతో దిగిన ఫొటోలను చూపుతూ, ప్రజలను మభ్యపెడుతూ ఇష్టానుసారంగా డబ్బులను తీసుకుంటూ ప్రవేశాలు కల్పిస్తుండగా, కాగజ్నగర్ పట్టణంలో సైతం కొందరు దళారులు ఇదే విధంగా చేస్తున్నారు.

• అక్రమం వెలుగులోకి వచ్చిందిలా.

మైనార్టీ గురుకులాల్లో 20 శాతం సీట్లను నాన్ మైనార్టీలకు 60 శాతం మైనార్టీలకు కేటాయిస్తారు. మైనార్టీయేతర సీట్లకోసం విద్యార్థులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. మైనార్టీ సీట్లు సైతం పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు. వీటిని ఇతరులకు కేటాయిస్తున్నారు. అది కూడా మైనార్టీ సొసైటీ కార్యదర్శి అనుమతితో జరగాల్సి ఉండగా, ఎలాంటి సిఫారసు లేఖలు లేకుండానే సీట్లు ఇప్పిస్తున్న వైనం కూడా ఇటీవల మైనార్టీ బాలుర గురుకులంలో చోటు చేసుకుంది. కొంత మంది తల్లిదండ్రులు మైనార్టీ బాలుర గురుకులంలో ఒక్కో సీటుకు రూ.40 వేలు చొప్పున ముగ్గురు విద్యార్థుల కోసం రూ.1.20 లక్షలు ఇచ్చారు. తర్వాత ఆ విద్యార్థులు గురుకులంలో ఉండమని వెనక్కి తిరిగి రాగా.. ఇచ్చిన డబ్బులను తిరిగివ్వమని దళారులను అడిగారు. వారు నిరాకరించడంతో తల్లిదండ్రులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తే, ఆగస్టు 29న అధికారులు విచారణ చేసి అక్రమాలను వెలుగులోకి తెచ్చారు.

• జ్యోతిబాఫులే గురుకులంలో అటెండరే అన్నీ

సిర్పూర్ నియోజకవర్గంలో ఓ బీసీ బాలుర గురుకులంలో అన్ని వ్యవహారాలు అటెండరే చక్కబెడుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం కాస్తా కోర్టువరకు వెళ్లడంతో ప్రిన్సిపల్ లాయర్ ద్వారా నోటీసు అందుకున్నట్లు తెలిసింది. సిర్పూర్(టి) మండలానికి చెందిన ఒక విద్యార్థి సీటు కోసం జ్యోతిబాఫులే గురుకులానికి రాగా ఆ ప్రిన్సిపల్ నిరాకరించినట్లు తెలిసింది. బయట ఉన్న అటెండర్ ఆ విద్యార్థి తల్లిదండ్రులను కలిసి రూ.60 వేలు ఇస్తే సీటిప్పిస్తానని చెప్పడంతో విద్యార్థి తల్లి కోర్టులో ప్రీ లిటిగేషన్ పిటీషన్ (పీఎల్పీ) వేసి, లాయర్ ద్వారా ప్రిన్సిపల్ కు నోటీసు ఇప్పించినట్లు తెలిసింది. ప్రిన్సిపల్ కోర్టు సంజాయిషీ ఇచ్చి సదరు విద్యార్థికి సీటు ఇచ్చినట్లు సమాచారం.

• మంత్రి పీఏ అని చెప్పుకొంటూ.!

ఆసిఫాబాద్ పట్టణంలో బీసీ గురుకులం, మైనార్టీ బాలికల గురుకులాలు ఉన్నాయి. మంత్రి పీఏ అని చెప్పుకొంటూ తిరిగే వ్యక్తి ఈ రెండు గురుకులాల్లో సీట్లు ఇప్పిస్తామని పేదల నుంచి అందినకాడికి దండుకుంటున్నాడు. ప్రవేశం లభిస్తుందని ఆశతో తల్లి తండ్రులు అప్పులు చేసి డబ్బులు తెచ్చి ఈయన చేతిలో పెట్టగా, రేపుమాపు అంటూ దాటవేస్తూ అందుబాటులో రాకుండా పోతున్నాడని సమాచారం.