Telugu Updates
Logo
Natyam ad

మహాత్ముడికి నేతల ఘన నివాళి.

ఆదర్శమూర్తి అడుగుజాడల్లో నడవాలని పిలుపు

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు కీలక నేతలు ఆయనకు నివాళులర్పించారు. ఆయన సేవల్ని గుర్తుచేసుకున్నారు. అహింసామార్గంలో నడుస్తూ శాంతిస్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఆంజనేయులు న్యూస్, దిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ జీవిత విలువలైన శాంతి, సమానత్వం, మత సామరస్యానికి మనల్ని మనం పునరంకితం చేసుకోవడానికి ఆయన జయంతి ఒక సందర్భం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మహాత్ముడి 153వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజాఘాట్ వద్ద ఆమె ఘనంగా నివాళులర్పించారు. అమృత మహోత్సవాలను నిర్వహించుకుంటున్న సందర్భంలో వచ్చిన ఈ గాంధీ జయంతికి మరింత ప్రాముఖ్యత సంతరించుకుందని తెలిపారు. భారతదేశం గురించి గాంధీజీ కన్న కలల సాకారం కోసం మనమందరం కృషి చేయాల్సిన సమయం ఇదేనని పిలుపునిచ్చారు.

• మరో ప్రముఖ నేత, మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రికి సైతం దిల్లీలోని విజయ్ ఘాట్లో రాష్ట్రపతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవల్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘జై జవాన్, జై కిసాన్ నినాదమిచ్చిన శాస్త్రీజీ హరిత విప్లవం, శ్వేత విప్లవంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఆదర్శాలు ఇప్పటికీ మనందరిలో స్ఫూర్తి నింపుతాయి” అని శాస్త్రిని ముర్ము గుర్తు చేసుకున్నారు.

• ప్రధాని మోదీ సైతం దిల్లీలోని రాజాఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులర్పించారు. గాంధీజీకి నివాళిగా ఖాదీ, దేశీయ హస్తకళల ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఆదర్శాలకు అనుగుణంగా జీవించాలని సూచించారు. మరోవైపు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి కూడా మోదీ నివాళులర్పించారు. “నిరాడంబరతకు శాస్త్రీజీ పెట్టింది పేరు. భారత చరిత్రలో చాలా కీలకమైన సమయంలో ఆయన పటిష్ఠ నాయకత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని మోదీ ఆయన సేవల్ని గుర్తుచేసుకున్నారు.