Telugu Updates
Logo
Natyam ad

జోరుగా స్థిరాస్తి వ్యాపారం..

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భారీ ఆదాయం

మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో భూదందా జోరుగా సాగుతోంది. పారిశ్రామిక ప్రాంతాలకు ప్రధాన కేంద్రంగా మారిన మంచిర్యాలలో ఇప్పటికే విశ్రాంత ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువ మంది ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి స్థిరపడ్డారు. పట్టణ సరిహద్దులో ఖాళీ స్థలాలు తగ్గడంతో నస్పూరు, క్యాతన్ పల్లి, మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా పెరిగింది. జిల్లా కేంద్రానికి సరిహద్దు పట్టణాల్లో చాలా మంది భూములు కొనుగోలు చేస్తున్నారు. అదే అవకాశంగా తీసుకున్న భూ వ్యాపారులు.. వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయాలు కానిచ్చేస్తున్నారు. కొందరు స్థిరాస్తి వ్యాపారులు లేఅవుట్ అనుమతి తీసుకుని ప్లాట్లు అమ్మకాలు చేయగా.. మరికొందరు అక్రమంగా విక్రయిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లేఅవుట్ అనుమతి ఉన్న ప్లాట్లు, లింక్ డాక్యుమెంట్లు ఉన్న ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. భూ వ్యాపారం జోరుగా సాగడంతో.. ఏటా మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజుల రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెరుగుతోంది. ఇక్కడ 17 రకాల దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కరోనా సమయంలో 2020-21లో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గింది. తదుపరి సంవత్సరాల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెరుగుతూనే ఉంది.

• కొనుగోలుకు ముందు రికార్డులు చూడాలి..

కొంతమంది భూ అక్రమార్కులు లేఅవుట్ అనుమతి లేకుండానే ప్లాట్లు అమ్మకాలు చేయడంతో.. కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్లు కాక నష్టపోతున్నారు. నస్పూరు, బెల్లంపల్లి, మందమర్రి లాంటి పట్టణాల్లో ప్రభుత్వ, అసైన్డ్ భూములు, సింగరేణి స్థలాలు అక్రమంగా అమ్మకాలు చేస్తున్నారు. అక్కడ మున్సిపల్ అనుమతి లేకుండానే ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసే ముందు రెవెన్యూ రికార్డుల్లో భూముల వివరాలు పరిశీలించుకుని లేఅవుట్ ఉన్న ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవనాలు నిర్మించుకునే అవకాశం ఉంది.