Telugu Updates
Logo
Natyam ad

ఆడిట్ లోను అవకతవకలు!

ఖర్చయిన నిధుల్లో 3 శాతం చెల్లిస్తే అంతా సరే

కాగజ్నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో అడిట్ చేస్తున్న అధికారులు

ఆంజనేయులు న్యూస్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్నగర్  పంచాయతీలకు కేంద్ర, రాష్ట్రాలు విడుదల చేసిన నిధులు, సమకూరిన ఆదాయాల్లో నయాపైసా పక్కదారి పట్టకూడదని, పనుల్లో పారదర్శకత పాటించాలనే ఆశయంతో సర్కారు ఆడిట్ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రతి పంచాయతీ ఆదాయాల వ్యయాలపై సంవత్సరానికి ఒకసారి ఆడిట్ చేయాల్సి ఉంటుంది. ఖర్చయిన నిధులు, వాటి తాలుకూ బిల్లుల్లో తేడా వస్తే నిధులు దుర్వినియోగమైనట్లు ఆడిట్ అధికారులు పరిగణనలోకి తీసుకొని ఆయా పంచాయతీల బాధ్యులపై చర్యకు ఉన్నతాధికారులకు పంపించాలి. కానీ జిల్లాలో ఆడిట్ నిర్వహణలోనూ అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖర్చు చేసిన నిధుల్లో మూడుశాతం డబ్బులు ఇస్తేనే అంతా బాగున్నట్లు నివేదిక ఇస్తున్నట్లు కొందరు సర్పంచులు బహిరంగంగానే చెబుతుండటం గమనార్హం.
జిల్లాలోని 15 మండలాల్లో 335 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రభుత్వ నిధులతో పాటు ఇంటి పన్నులు, ఇంటి నిర్మాణాల అనుమతులు, వ్యాపార సంస్థల లైసెన్సులు, వారాంతపు సంతల రుసుం తదితర వాటితో పంచాయతీలకు ఆదాయాలు సమకూరుతాయి. పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి అభివృద్ధి పనులు చేపట్టాలనే నిబంధనలున్నాయి. జిల్లాలో సర్పంచులు పనులు చేపట్టిన అనంతరం పాత తేదీలతో తీర్మానాలు చేయడం షరా మాములుగానే సాగుతోంది. ప్రతి నెలకోసారి పంచాయతీల నిర్వహణ తీరుపై మండల పంచాయతీ అధికారి, మూడు నెలలకోసారి డీఎల్పీఓ తనిఖీలు చేయాల్సి ఉండగా. ఈ ప్రక్రియ కాగితాలకే పరిమితం అవుతోంది. పంచాయతీల్లో నిధులు దుర్వినియోగమైనట్టు ఫిర్యాదులు వచ్చినట్లయితే డీఎల్పీఓ స్థాయి అధికారి విచారణ చేపట్టాలి. నిధులు పక్కదారి పట్టినట్లు తేలితే జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో కొన్నిచోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు విచారణలో తేలినా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కాగజ్నగర్ మండలంలోని భట్టుపల్లి పంచాయతీలో రూ. లక్షలు దుర్వినియోగమైనట్టు విచారణలో తేలినప్పటికీ నేటికి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

ఈ విషయంపై జిల్లా ఆడిటర్ రాజేశంను ‘ఆంజనేయులు న్యూస్’ సంప్రదించగా.. ఏ సర్పంచి తమకు నయాపైసా ఇవ్వడం లేదని కొట్టిపారేశారు.

నిబంధనలు గాలికొదిలేస్తున్నారు..

ఆడిట్ అనేది నిధుల వినియోగానికి లక్ష్మణ రేఖ వంటింది. ఇందులో కూడా లొసుగులు బయటపడుతున్నాయి. పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల ఎంబీ (మెయింటెనెన్స్ బుక్)లు, ఇతరత్రా వాటికి ఖర్చయిన నిధుల తాలుకూ బిల్లు ఉండాలి. ఆడిటర్లు ఈ నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. వ్యయాలకు సరిపడా బిల్లులు లేకపోతే బోగస్ రసీదులు పెట్టుకునేలా అధికారులే సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ‘ఒకసారి ఆడిట్ అయిన తర్వాత ఆ సంవత్సర తాలుకూ నిధుల వినియోగంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే వీలులేదు. పంచాయతీల నిధుల వినియోగంపై ఆడిట్ కీలక ఘట్టమైనందున ఖర్చయిన నిధుల్లో మూడుశాతం ముట్టజెప్తున్నామని’ ఓ సర్పంచి ‘ఆంజనేయులు న్యూస్’ తో వ్యాఖ్యానించడం గమనార్హం.