Telugu Updates
Logo
Natyam ad

సమీకృత కలెక్టర్ భవన సముదాయాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాలి.

మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని నస్పూర్ నిర్మితమవుతున్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) పనులను త్వరగా పూర్తి చేసి మే మాసంలోగా ప్రారంభానికి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ చేపట్టిన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను రోడ్లు-భవనాల శాఖ ఈ. ఈ. రాముతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు అన్నీ ఒకే చోట లభించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) నిర్మాణాలలో భాగంగా జిల్లాలోని నస్పూర్లో చేపట్టిన పనులను సంబంధిత అధికారులు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. భవన సముదాయంలో ప్రభుత్వ శాఖలకు కేటాయించిన కార్యాలయ గదులలో విద్యుత్ సరఫరా, త్రాగునీటి ఏర్పాటు పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. వివిధ సేవల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు కూర్చునేందుకు కుర్చీలు, త్రాగునీరు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, భవన ఆవరణలో పచ్చని ఆహ్లాదకర వాతావరణం ఉండే విధంగా గడ్డి, మొక్కలను పెంచాలని, కార్యాలయానికి చేరుకునే అంతర్గత రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అధికారులు, గుత్తేదారులు సమన్వయంతో పని చేసి మే మాసంలోగా పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు.