Telugu Updates
Logo
Natyam ad

రెండేళ్లకే శిథిలం

బల్దియాలో అభివృద్ధి పనులు అభాసుపాలవుతున్నాయి. నాసిరకంగా చేసిన పనులతో రూ. కోట్లాది నిధులు వృథా అవుతున్నాయి.

సినిమారోడ్డులో డివైడర్ మధ్యలో రాళ్లు ఊడిన దృశ్యం

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: బల్దియాలో అభివృద్ధి పనులు అభాసుపాలవుతున్నాయి. నాసిరకంగా చేసిన పనులతో రూ. కోట్లాది నిధులు వృథా అవుతున్నాయి. పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా రహదారుల మధ్య నిర్మించిన డివైడర్లు రెండేళ్లకే శిథిలమవుతున్నాయి. సిమెంటు మిశ్రమం రాలిపోయి పాడిరాళ్లు ఊడిపోతున్నాయి. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం, అధికారులు పర్యవేక్షణ లోపంతో గుత్తేదారుదే ఇష్టారాజ్యంగా మారింది. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యం, ఆదిలాబాద్ పట్టణంలో వ్యాపారపరంగా ప్రధాన రహదారులైన దేవీచంద్ చౌక్ నుంచి పంజాబ్ చౌక్ వరకు, వివేకానంద కూడలి నుంచి రైల్వేస్టేషన్ వరకు దాదాపు రూ.3 కోట్ల నిధులతో డివైడర్ల నిర్మాణం చేపట్టారు. పనులు జరుగుతున్న సమయంలో గుత్తేదారు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో కొన్నిచోట్ల విభాగిణులు శిథిలమయ్యాయి. సినిమా రోడ్డులో, గాంధీచౌక్, పంజాబ్ చౌక్, శివాజీకూడలి సమీపంలో దెబ్బతిన్నాయి. శివాజీచౌక్ నుంచి రైల్వేస్టేషన్ వరకు, గాంధీచౌక్ నుంచి దేవీచంద్ చౌక్ వరకు నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ రహదారులపై ప్రజలు, వాహనాల రాకపోకలతో నిత్యం కుచించుకుపోయి ట్రాఫిక్ సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ రహదారుల మధ్యలో మొక్కలు నాటేందుకు బల్దియా పాలకవర్గం రూ. కోటి నిధులు వెచ్చించారు. ఒకవైపు డివైడర్లే కూలిపోతుండగా వాటికి మరమ్మతులు చేయడం మర్చిపోయి మధ్యలో మొక్కలు నాటేందుకు నిధులు వెచ్చించడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా ఇటీవలే రూ.20 లక్షలు ఖర్చు చేసి డివైడర్లకు రంగులు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా అధికారులు దెబ్బతిన్న డివైడర్లకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.