Telugu Updates
Logo
Natyam ad

వైద్యారోగ్యశాఖలో బదిలీల గుబులు!

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా వైద్యారోగ్యశాఖలో బదిలీల గుబులు మొదలైంది. మరో మూడు రోజుల్లో వీరి భవితవ్యం తేలనుంది. ఈ నెల 18 నుంచి 20 వరకు ఆరోగ్యశాఖలో బదిలీల ప్రక్రియ పూర్తికానుంది. జిల్లాలో బదిలీకి అర్హత ఉన్నవారు 160కిపైగా ఉండగా 40 శాతం మేర స్థానచలనం కలగనుండటంతో చాలామందికి భయం పట్టుకుంది. దీనికితోడు సంబంధితశాఖ రాష్ట్రస్థాయిలో ఈ బదిలీల ప్రక్రియను కొంత జాప్యం చేస్తుండటం వారిలో మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే జిల్లాశాఖ నుంచి వివిధ విభాగాల్లో పనిచేస్తూ నాలుగేళ్లు పూర్తిచేసుకున్నవారి జాబితాను సిద్ధం చేసి డీహెచ్ కు పంపించింది. చాలావరకు అధికారి స్థాయి నుంచి ఏఎన్ఎం వరకు నాలుగేళ్లు అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పూర్తి చేసుకున్నవారే భారీగా ఉండటం విశేషం.

• పలువురు అధికారులు ఉక్కిరిబిక్కిరి

బదిలీలకు అర్హత ఉన్న జిల్లా ఆరోగ్యశాఖ ఉద్యోగుల్లో వీటిపై విముఖతే కనిపిస్తోంది. ప్రతి పోస్టు జోనల్, అంతకంటే పైస్థాయిది కావడంతో ఆందోళన మొదలైంది. ఏఎన్ఎం సైతం జోనల్ కావడంతో అయిదు (మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి) జిల్లాల్లో ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందో అని వారిలో భయం మొదలైంది. ప్రస్తుతం బదిలీపై ఎలాంటి ఒత్తిడి, పైరవీలు పనిచేయకపోవడంతో పలుకుబడి ఉన్నవారు సైతం ఏమీ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లాలో పాతుకుపోయిన పలువురు అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం.

• పాతుకుపోయినవారు పక్కకు వెళతారా.

జిల్లా వైద్యారోగ్యశాఖలో పాతుకుపోయిన అధికారుల సంఖ్య పదుల్లో ఉంది. వీరందరికీ ప్రస్తుతం బదిలీ తప్పనిసరి అయినట్లు తెలుస్తోంది. దాదాపు పదేళ్ల నుంచి ఒకేచోట ఉండటంతో 40 శాతంలో మొదట తమ పేరే ఉంటుందనే ఆందోళన వారిలో కనిపిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం బదిలీ పారదర్శకంగా జరిగి అర్హులందరిని ఇతర చోట్లకు పంపిస్తే వెళ్తారా..? లేదా..? అనేది సందిగ్ధంగా మారింది. గతంలో మాదిరి పైరవీలు, పలుకుబడితో రాష్ట్రస్థాయి అధికారుల చేతులు తడిపి డిప్యూటేషన్ల(వర్క్ ఆర్డర్స్) ద్వారా జిల్లాలో పాతుకుపోతారా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.