Telugu Updates
Logo
Natyam ad

ఆసుపత్రులు దూరం.. బాధితులకు భారం

ప్రజా సంక్షేమంలో ప్రధాన భాగమైన ఆరోగ్యకేంద్రాలు పేదలకు భారంగా మారాయి. ఆసుపత్రికి వెళ్లాలంటే తీవ్ర అవస్థలతోపాటు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

మూడు చోట్ల రవాణా కష్టాలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరినది తీరంలో ఉన్న ఎంసీ హెచ్ కు ఆటోలో వచ్చిన గర్భిణి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజా సంక్షేమంలో ప్రధాన భాగమైన ఆరోగ్యకేంద్రాలు పేదలకు భారంగా మారాయి. ఆసుపత్రికి వెళ్లాలంటే తీవ్ర అవస్థలతోపాటు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి ప్రజా సంక్షేమంలో ప్రధాన భాగమైన ఆరోగ్యకేంద్రాలు పేదలకు భారంగా మారాయి. ఆసుపత్రికి వెళ్లాలంటే తీవ్ర అవస్థలతోపాటు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సర్కారు దవాఖానకు వందల రూపాయలు ఖర్చు చేసి వెళ్లాల్సి వస్తోంది. పట్టణాలకు దూరంగా ఈ కేంద్రాలు ఉండటం, సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కనీసం ప్రభుత్వపరంగా రవాణా సదుపాయాలు కల్పించే ఆలోచన చేస్తే బాధితులకు ప్రయోజనం కలుగుతుంది.

• అవసరమైతే కాలినడకనే..

బెల్లంపల్లి నియోజకవర్గంలో వందపడకల ఆసుపత్రి అందుబాటులోకి వచ్చినా ఆయా నియోజకవర్గ ప్రజలతో పాటు కుమురంభీం ఆసిఫాబాద్ నుంచి బాధితులకు ప్రయోజనం లేకుండా పోతోంది. రవాణాపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారికి అతి దగ్గరగా ఉన్నా ఆర్టీసీ బస్సులు ఒక్కటి కూడా ఈ దారిలో వెళ్లడం లేదు. సమీపంలోని ప్రయాణ ప్రాంగణంలో నిలిపినా అక్కడి నుంచి ఆసుపత్రికి చేరాలంటే సుమారు 1.5 కిమీలు దూరం ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి ఆటోలు సమయానికి అందుబాటులో ఉండవు. తప్పనిసరిగా బాధితులు సైతం కాళ్లకు పనిచెప్పాల్సిందే. ఈ ఆసుపత్రికి వెళ్లడం కంటే నేరుగా మంచిర్యాలబాట పట్టడమే మేలు అనుకునే పరిస్థితి నెలకొంది. స్థానికులు సైతం రూ.80-100 ఖర్చుతో ఆటో ప్రయాణం చేయాల్సిందే.

• పెద్దాసుపత్రికి ఖర్చు ఎక్కువే..

మంచిర్యాల నియోజకవర్గంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందాలంటే బాధితులు చేతిచమురు వదలాల్సిందే. ముఖ్యంగా గర్భిణులు మరింత భారం మోయాల్సి వస్తోంది. గోదావరినదితీరాన ఎంసీహెచ్ ఉండటంతో జిల్లా నలుమూలల నుంచి మంచిర్యాలకు రావడం ఒక ఎత్తయితే ఇక్కడి నుంచి ఈ కేంద్రానికి చేరుకోవడం మరోఎత్తుగా మారింది. ప్రయాణప్రాంగణం, ఐబీ, రైల్వే వంతెన.. ఇలా ఏ చోట నుంచైనా ఆటోలో వెళ్లాల్సిందే. 102, 108 సేవలు అందిస్తున్నా బాధితుల తీవ్రత దృష్ట్యా సమయానికి అందుబాటులో లేకపోవడం, రాకపోవడంతో తప్పనిసరిగా ప్రైవేటు వాహనాలబాట పడుతున్నారు. రానుపోను రూ. 200 250 ఖర్చు భరిస్తున్నారు. కేవలం బాధితులే కాకుండా సిబ్బంది సైతం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

• త్వరగా వెళ్లాలంటే ఆటో దిక్కు..

చెన్నూరు నియోజకవర్గం కొద్దిగా అభివృద్ధిబాట పడుతున్నా ఆరోగ్యపరంగా మాత్రం ఇంకా అవస్థలు తప్పడంలేదు. ప్రయాణప్రాంగణానికి అతిసమీపంలో ఉన్న ఇక్కడి సీహెచ్ సి (సామాజిక ఆరోగ్య కేంద్రం) కి నూతన భవనం నిర్మాణంలో ఉంది. పనులన్నీ పూర్తి కావాలంటే కనీసం మరో ఏడాదైనా పడుతుందని అంచనా. దీంతో పట్టణానికి దూరంగా ఉన్న ఎక్కపేటలో కొంతకాలంగా తాత్కలికంగా సేవలు అందిస్తున్నారు. ఈ కేంద్రం సేవలు పొందాలంటే బాధితులు ఖర్చు చేయాల్సిందే. పట్టణవాసులకు కాస్త తక్కువైనా పరిసర మండలాలు, గ్రామాల నుంచి వచ్చేవారికి ప్రయాణం ప్రయాసగా మారింది. ఆసుపత్రికి చేరుకోవాలంటే రెండు, మూడు వాహనాలు మారాల్సి. వస్తుంది. అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రం ఆటోనే దిక్కు. రూ.100 నుంచి రూ.150 ఖర్చును భరించాల్సిందే.