Telugu Updates
Logo
Natyam ad

అడగకు.. పెట్టిందే తినాలి.!

దవాఖానాల్లో రోగులకు చాలీచాలని అన్నం

నీళ్ల పప్పు పెట్టి ఆహారపట్టికను అటకెక్కిస్తున్నారు.

పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: వరుస వానలతో వ్యాధులు ముసురుకుంటున్న ప్రస్తుత తరుణంలో. వివిధ సమస్యలతో బాధపడుతూ రోగులు సర్కారు దవాఖానాలకు వరుస కడుతున్నారు. చికిత్సకోసం ఆసుపత్రుల్లో రెండు మూడు రోజులు ఉంటున్నారు. వీరికి ఉదయం పాలు, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించాల్సి ఉండగా.. టెండర్ దక్కించుకున్న గుత్తేదారు మాత్రం రెండు మూడు రోజులకోసారి చాలీచాలని అన్నం, నీళ్ల పప్పు పెట్టి ఆహారపట్టికను అటకెక్కిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఏహెచ్ (ఏరియా హాస్పిటల్) ఆసుపత్రిలో నిత్యం అయిదారు వందల మంది ఓపీ ఉంటుంది. ఇందులో 30-50 మంది వరకు ఇన్పేషెంట్స్. వ్యాధులు తగ్గేవరకు ఆసుపత్రిలో రోగులతోపాటు వారి సహాయకులు ఉంటున్నారు. మారిన ఆహారపట్టిక ప్రకారం.. వీరికి మూడు పూటలా ఆహారం అందించాలి. గుత్తేదారు మాత్రం అన్నం, పప్పుతో సరిపెడుతున్నాడు. అదీ మధ్యలో ఒకటి రెండు రోజుల విరామం ఇస్తున్నాడు. రోగుల మంచాల వద్దకు వచ్చి భోజనం అందించాలి. దీనికి భిన్నంగా గదుల బయటే అప్పుడప్పుడు కొద్దిపాటి భోజనం, నీళ్ల పప్పు అందిస్తున్నారు. చాలా సమయాల్లో భోజనం పెట్టింది సైతం వార్డుల్లో ఉన్న వారికి తెలియడం లేదు. విధుల్లో ఉన్న వైద్యులకు సైతం భోజనం అందించాల్సి ఉంది. వీరు ఆసుపత్రిలో భోజనం చేయకున్నా వీరి పేర్ల మీద సైతం గుత్తేదారు బిల్లులు తీసుకుంటున్నారు. ఏహెచ్ ఆసుపత్రిలో 19 మంది, జిల్లాలోని పీహెచ్సీ ల్లో 25 మంది వైద్యులు ఉన్నారు.

• ఇంటి నుంచే ఆహారం..

ప్రధాన ఆసుపత్రిలో భోజనమనేది కేవలం కాగితాలకే పరిమితం కావడంతో రోగుల బంధువులు బయట నుంచే లేదా దగ్గరగా ఉంటే ఇళ్ల నుంచి తెచ్చుకుంటున్నారు. తాగునీటి ప్లాంట్ వృథాగా ఉంది. ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన నీళ్ల డబ్బా పైన తెరచి ఉండడం, చుట్టూ అపరిశుభ్ర వాతావరణం కారణంగా.. ఈ నీళ్లు తాగితే సకల రోగాలూ వచ్చే ప్రమాదం ఉంది. జిల్లాలోని 20 పీహెచ్సీ ల్లో సైతం ప్రసవం అయిన వారం రోజుల వరకు, ఇతరులు వ్యాధులు తగ్గే వరకు ఆసుపత్రిలోనే ఉంటారు. వీరికి సైతం ఎక్కడా భోజనాలు పెట్టడం లేదు. అందరూ దాదాపుగా ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు.