Telugu Updates
Logo
Natyam ad

దివ్యాంగులు అన్ని రంగాలలో రాణించాలి

జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: దివ్యాంగులు అన్ని రంగాలలో రాణించాలని, దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా స్త్రీ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలకు జిల్లా సంక్షేమశాఖ అధికారి కె. చిన్నయ్యతో కలిసి హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ నేటి ప్రపంచంలో దివ్యాంగులు అనేక రంగాలలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని, ఇదే స్ఫూర్తితో జిల్లాలోని దివ్యాంగులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను, పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని అన్నారు. పరుగు పందెం, షాట్పుట్, చెస్, క్యారమ్, జావెలిన్ త్రో, మ్యూజికల్ చైర్ పోటీలలో జూనియర్, సీనియర్ విభాగాలు ఉంటాయని తెలిపారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు ఈ నెల 15వ తేదీన జిల్లా కేంద్రంలోని మైనారిటీ ఫంక్షన్హాల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలలో బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం క్రీడాకారులతో కలిసి చదరంగం, క్యారమ్ ఆటలు ఆడారు. ఈ కార్యక్రమంలో ఎస్.సి. కార్పొరేషన్ ఈ.డి. దుర్గాప్రసాద్, జిల్లా క్రీడా యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి, జిల్లా వయోజన విద్య అధికారి పురుషోత్తం, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, దివ్యాంగుల సంఘాల నాయకులు మహేందర్, తిరుపతి, సతీష్, భాగ్య సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.