Telugu Updates
Logo
Natyam ad

డిజిటల్ ఇంటి నెంబర్ల కేటాయింపు ఏది?

అయిదు నెలలైనా పురపాలికల్లో అతీగతీలేదు..

పురపాలికల్లో ఇళ్లకు అధికారులు కేటాయించే డిజిటల్ నెంబర్లు ఇలా ఉండనున్నాయి.

ఆంజనేయులు న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా:  పట్టణాల్లో సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ ఇంటి నెంబర్ల విధానానికి గతేడాది డిసెంబరులో రాష్ట్ర పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది మార్చి చివరి వరకల్లా అన్ని పురపాలక సంఘాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. అయిదు నెలలు కావొస్తున్నా ఉమ్మడి జిల్లాలో నేటికీ దీనికి అతీగతీ లేకుండా పోయింది. ఏ ఒక్క పురపాలక సంఘంలోనూ ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 పురపాలక సంఘాలున్నాయి. అందులో ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, కాగజ్నగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి పాత పురపాలికలు కాగా లక్షెట్టిపేట, చెన్నూరు, నస్పూరు, క్యాతన్పల్లి, ఖానాపూర్లు నూతనంగా ఏర్పడ్డాయి. వీటి పరిధిలో 333 వార్డులు 1,93,712 గృహాల్లో సుమారు 10 లక్షల మంది జనాభా నివసిస్తోంది. ప్రస్తుతం ఇంటి నంబర్లు వరుసగా లేకపోవడంతో తికమక అవుతోంది. తద్వారా అత్యవసర సమయాల్లో ఇంటిని గుర్తించడం కష్టతరమవుతోంది. ఇరుకు రహదారులు, నిర్మాణాలు సక్రమంగా చేపట్టకపోవడం ఇళ్ల క్రమసంఖ్యలను అందుబాటులో ఉంచకపోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకే పలకతో బహుళ ప్రయోజనాలు ఉండేలా రూపొందించిన ఇళ్లకు డిజిటల్ నెంబర్ల కేటాయింపు ప్రక్రియ అధికారుల నిర్లక్ష్యంతో అటకెక్కింది. ఈ విధానం అమలు ద్వారా ఉమ్మడి జిల్లాలోని పురపాలక సంఘాల్లో చిరునామా చిక్కులను అధిగమించడంతో పాటు ఆదాయం పెంపునకు దోహదపడే అవకాశముండగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.