Telugu Updates
Logo
Natyam ad

ధరణి దరఖాస్తులకు అనుమతెప్పుడో?

పాలనాధికారి ఆమోదం కోసం పెండింగ్ లో చూపిస్తున్న దరఖాస్తుల చిత్రం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రైతుల భూదస్త్రాల మార్పిడి, ఇతర భూముల సమస్యలు గతంలో అనేకం ఉండేవి.. ఒకరి భూమిలో మరొకరు సాగు చేస్తూ గొడవలు పడేవారు. దళారుల రాజ్యం ఉండేదని.. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసి మూడేళ్లపాటు శ్రమించి ధరణి వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ ఇటీవల మంచిర్యాల సభలో అన్నారు. ధరణితో సమస్యలు దూరమవుతాయని ఆశపడిన రైతులు.. నిరాశ ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాతతండ్రులు చనిపోయిన తర్వాత వారసత్వంగా వచ్చిన భూమిని పొందేందుకు రైతులు విరాసత్, ఇతర మిస్సింగ్ సర్వే నంబర్ ఇలా పలు సమస్యలపై మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటారు. వాటికి పాలనాధికారి ఆమోదం తప్పనిసరి. అయితే దాదాపు నాలుగు నెలలుగా పాలనాధికారి ధరణి సంబంధించిన పత్రాలు పరిశీలించకపోవడంతో దాదాపు 5594 దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు. మీసేవ కేంద్రాల్లో నగదు చెల్లించి నెలలు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.

జిల్లా పాలనాధికారి వద్ద పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తుల వివరాలు

విరాసత్: 533

పెండింగ్ మ్యూటేషన్: 228

నాలా కోసం దరఖాస్తు చేసుకున్న వారు: 364

ఇతర సవరణలకు దరఖాస్తు చేసుకున్న వారు: 2098

నిషేధిత జాబితా నుంచి తొలగించాలని: 607

ఇతర దరఖాస్తులు: 1746