Telugu Updates
Logo
Natyam ad

డిగ్రీ పరీక్షల అడ్మిట్ కార్డులపై.. ప్రధాని మోదీ, ధోనీల ఫొటోలు..!

తీవ్రంగా పరిగణించిన యూనివర్సిటీ.. విచారణకు ఆదేశం

ఆంజనేయులు న్యూస్, పట్నా: డిగ్రీ పరీక్షల అడ్మిట్ కార్డులపై ప్రధానమంత్రితోపాటు ఇతర ప్రముఖుల ఫొటోలు ఉండటం చర్చనీయాంశమయ్యింది. బిహార్ లోని ఓ యూనివర్సిటీ పరీక్షలో చోటుచేసుకున్న ఈ ఘటనను సదరు వర్సిటీ తీవ్రంగా పరిగణించింది. ఆ ఫొటోలను విద్యార్థులే అప్లోడ్ చేసినట్లు భావిస్తోన్న అధికారులు.. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతోపాటు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. బిహార్ లోనీ లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీలో డిగ్రీ పరీక్షల కోసం ఇటీవల అడ్మిట్ కార్డులు జారీ చేశారు. అందులో కొన్ని అడ్మిట్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ, బిహార్ గవర్నర్ ఫగూ చౌహాన్ ఫొటోలు ఉన్నాయి. మధుబనీ, సమస్తిపూర్, బెగుసరాయ్ జిల్లాల పరిధిలోని కాలేజీలకు చెందిన బీఏ మూడో ఏడాది విద్యార్థులకు ఇవి ఎక్కువగా వచ్చాయి. డిగ్రీ పరీక్షల్లో మోదీ, ధోనీ ఫొటోలు రావడంతో అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ విషయం యూనివర్సిటీ దృష్టికి రావడంతో అధికారులు స్పందించారు. ‘అడ్మిట్ కార్డుల జారీ ప్రక్రియ ఆన్లైన్ లో కొనసాగుతుంది. ఈ క్రమంలో విద్యార్థులే తమ ఫొటోలతో పాటు వివరాలను అప్లోడ్ చేయాలి. అనంతరం వాటిని పరిశీలించి కార్డులు జారీ చేస్తాం. ఇదే సమయంలో కొందరు విద్యార్థులు బాధ్యతారహితంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది’ అని యూనివర్సిటీ రిజిస్ట్రార్ పేర్కొన్నారు. యూనివర్సిటీ పేరుకు మచ్చతెచ్చే ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామన్న ఆయన.. పూర్తి విచారణకు ఆదేశించామన్నారు. ఇప్పటికే ఆయా విద్యార్థులకు షోకాజ్ నోటీసులు జారీచేశామని.. వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తామన్నారు. ఇదిలాఉంటే, ఇటువంటి ఘటనే అక్కడి ముజఫర్పుర్ లోనూ రెండేళ్ల కిందట జరగడం గమనార్హం.