Telugu Updates
Logo
Natyam ad

ఎమ్మెల్యేల మధ్య వైరుధ్యం. అధిష్ఠానం చేరిన పోరు

కేటీఆర్ కు బోథ్ ఎమ్మెల్యే ఫిర్యాదు

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: జిల్లా గులాబీదళంలో అంతర్గత పోరు బయటపడుతోంది. ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేల మధ్య ఉన్న వైరుధ్యం అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. బాల్యం నుంచి కలిసి ఉన్న ఇద్దరి మధ్య కొంతకాలంగా రాజకీయ అగాథం నెలకొంది. తాజాగా సొనాల నూతన మండలం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలపడంతో.. ఈ నెల 5న సొనాలలోనే భారాస విజయోత్సవ సభ నిర్వహించింది. జిల్లా అధ్యక్షుడి హోదాలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ గోడం నగేష్ సహా పలువురు జడ్పీటీసీ సభ్యులు, మండలాధ్యక్షులు విజయోత్సవ సభలో పాల్గొన్నప్పటికీ రాథోడ్ బాపురావు సహా ఆయన వర్గం హాజరుకాలేదు. నియోజకవర్గంలో సభ నిర్వహించే విషయమై స్థానిక ఎమ్మెల్యేగా తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై.. బాపురావు సహా ఆయన వర్గం తీవ్ర అసంతృప్తికిలోనైంది.

ఇదీ జోగు రామన్న ప్రసంగం.

ఈ నెల 5న సొనాలలో ఏర్పాటుచేసిన సభలో జోగు రామన్న ప్రసంగిస్తూ… ‘సొనాల మండలం ఏర్పాటు విషయం ఛాలెంజ్ గా తీసుకున్న. సీఎం కేసీఆర్ తో మాట తీసుకున్నాకే సొనాల సభలో పాల్గొంటానని చెప్పా. అలాగే చేశా. పగటి దయ్యాలు, పగటి భూతాలు ఎన్నోసార్లు అడ్డుపడ్డాయి. ఆఖరిరోజు కూడా మండల ఏర్పాటును ఆపడానికి అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి మండలాన్ని సాధించుకున్నాం. అందుకే వచ్చా.’ ఈ వ్యాఖ్యలతో కూడిన జోగు రామన్న ప్రసంగంలోని వీడియోని బాపురావు వర్గం మంత్రి కేటీఆర్ కు సమర్పించడంతో ఇద్దరి మధ్య కొనసాగుతున్న వైరం బయటపడినట్లయింది. ఎమ్మెల్యేగానే కాకుండా అందరినీ ఏకతాటిపై నడిపించే జిల్లా అధ్యక్షుడిగానైనా తన నియోజకవర్గంలో సభ నిర్వహించి, తననే పిలవకపోతే ఎలా అనే విషయమై బాపురావు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఇక తాడోపేడో తేల్చుకోవాలనే ఆలోచనతోనే రామన్న, మాజీ ఎంపీ నగేష్, సీనియర్ నేత లోక భూమారెడ్డి తనను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లడం భారాసలో అసమ్మతి రాజకీయ సెగ పుట్టిస్తోంది. సీఎం కేసీఆర్ ను కలిసేందుకే బాపురావు రెండు, మూడు రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో చివరికి కేటీఆర్ ను కలిసినట్లు తెలిసింది. త్వరలో ఏదో ఒక ఇతర కార్యక్రమాన్ని ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బేల జైనథ్ సభ నిర్వహించాలని బాపురావు నిర్ణయించడమే కాకుండా తన అనుచరులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిసింది.

బాధ చెప్పాను: బాపురావు

`ఓ శాసనసభ్యుడిగా నా బాధను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లా. అందులో తప్పేంలేదు. 2018 నుంచి నన్ను బదనాం చేయడానికి యత్నిస్తున్నారు. వ్యక్తిగతంగా నేను ఎవరికీ వ్యతిరేకం కాదు. సోనాల మండల ఏర్పాటును నేనే అడ్డుకున్నట్లు విమర్శించడమంటే ప్రతిపక్షాలకు, పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతం ఇచ్చినట్లే కదా. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి జోగు రామన్నతో స్నేహం ఉంది. ఇప్పుడు కూడా ఆయనంటే గౌరవం ఉంది. కానీ ఆయన ఎవరి కోసమే నన్ను బదనాం చేయడం బాధగా ఉంది.’