Telugu Updates
Logo
Natyam ad

మట్టి వినాయకులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం.

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రజలు మట్టి వినాయకులను పూజించాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని సస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన బంకమట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పండుగ సందర్భంగా ప్రజలంతా మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణ పరిరక్షణలో, కాలుష్య నియంత్రణలో భాగస్వాములు కావాలని తెలిపారు. మట్టి వినాయకులను పూజించడంతో చెరువులు, జలాశయాలు కలుషితం కాకుండా రక్షించబడతాయని, బంకమట్టి వినాయకులను పూజించడం మన సంస్కృతి అని తెలిపారు. వివిధ రసాయనాలు రంగులు వేసి తయారు చేసిన వాటిని నిమజ్జనం చేసినప్పుడు నీటిలో త్వరగా కలవకపోవడంతో నీరు, నేల కలుషితమవుతాయని అన్నారు. పర్యావరణ పరిరక్షణ, జల వనరుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మట్టితో తయారు చేసి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని తెలిపారు.

అనంతరం చెరువు మట్టి గణపతి మట్టి సంబంధిత గోడప్రతులను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండల అధికారి నాగేశ్వర్ రావు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, అధికారుల సంఘం అధ్యక్షులు దుర్గాప్రసాద్, పర్యావరణ పరిరక్షకుడు గుండేటి యోగేశ్వర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.