Telugu Updates
Logo
Natyam ad

అనిశాకు చిక్కిన వాణిజ్య పన్నుల అధికారి

పట్టుబడిన వాణిజ్య పన్నుల శాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి

ఆంజనేయులు న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా: దుకాణం జీఎస్టీ అనుమతి జారీకి డబ్బులు తీసుకుని ఓ అధికారి అవినీతి నిరోధక శాఖ (అనిశా)కు చిక్కారు. అనిశా అదనపు ఎస్పీ కృష్ణగౌడ్ కథనం ప్రకారం.. నారాయణపేట మద్దూర్ మండలం ఒంటిగుండుతండాకు చెందిన సంతోష్ నాయక్ మహబూబ్ నగర్ పట్టణం మర్లు ప్రాంతంలో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సామగ్రి దుకాణం ఏర్పాటుకు గదిని అద్దెకు తీసుకున్నారు. దుకాణానికి జీఎస్టీ అనుమతి కోసం గత నెల 17న అంతర్జాలం ద్వారా జిల్లా వాణిజ్య పన్నుల శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అదే నెల 22న మహబూబ్ నగర్ సహాయ వాణిజ్య పన్నుల శాఖ అధికారి (ఏసీటీవో) వెంకటేశ్వర్ రెడ్డి సంతోష్ నాయక్ దుకాణాన్ని సందర్శించారు. నిబంధనలు పాటించలేదని, దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. జీఎస్టీ అనుమతి కావాలంటే ఈ నెల 26న రూ.50వేల ఇవ్వాలని కోరగా బాధితుడు రూ.10వేలు ఇస్తానన్నారు. అనిశా అధికారులకు 26న ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం రూ.10వేల నగదు తీసుకెళ్లి కార్యాలయంలో అధికారికి ఇచ్చి బయటకు రాగా అనిశా ఏఎస్పీ, సీఐలు, సిబ్బంది వెళ్లి పట్టుకున్నారు. అధికారి స్వస్థలమైన గద్వాల పట్టణంలోని వేంకటేశ్వర కాలనీలోని అతడి ఇంట్లోనూ అనిశా అధికారులు వెంకట్ రావు, రామారావు తదితరులు పోలీసులతో కలిసి సోదాలు చేస్తున్నారు. ఆస్తులు, ఇళ్లు, ఆభరణాలు, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములు తదితర అంశాలపై ఆయన సతీమణి, కుటుంబ సభ్యులను విచారించారు. అధికారిని అరెస్ట్ చేసి హైదరాబాద్ లోని నాంపల్లిలోని అనిశా కోర్టుకు తరలిస్తున్నట్లు ఏఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిశా సీఐలు లింగస్వామి, సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ, సిబ్బంది పాల్గొన్నారు.