క్రీజు వదిలి ముందుకు వచ్చి పిచ్ మీద నృత్యం చేస్తున్నట్లుగా షాట్ ఆడితే అది కాస్తా సిక్సర్.. పిచ్ కు దూరంగా వెళ్తున్న వైడ్ బంతిని వెంటాడుతూ బ్యాట్ ను తాకిస్తే అది కూడా బౌండరీని దాటేసింది..
ఆంజనేయులు న్యూస్: క్రీజు వదిలి ముందుకు వచ్చి పిచ్ మీద నృత్యం చేస్తున్నట్లుగా షాట్ ఆడితే అది కాస్తా సిక్సర్.. పిచ్ కు దూరంగా వెళ్తున్న వైడ్ బంతిని వెంటాడుతూ బ్యాట్ ను తాకిస్తే అది కూడా బౌండరీని దాటేసింది.. నడుం కంటే ఎత్తులో వచ్చిన పుల్టాస్ బంతిని కొడితే అదేమో స్టాండ్స్ లో పడింది.. ఇక షార్ట్ పిచ్ బంతిని వికెట్ వెనక్కి ఆడితే అది కూడా నేరుగా వెళ్లి బౌండరీ అవతల తేలింది.. ఇలా సూర్యకుమార్ యాదవ్ ఏ షాట్ ఆడితే బంతి గమ్యం బౌండరీనే అయింది. భీకర ఫామ్ లో ఉన్న అతడికి బంతులు ఎలా వెయ్యాలో తెలియని అయోమయంలో పడిపోయారు సఫారీ బౌలర్లు. ఏదో సుడి ఉన్నట్లుగా అతను ఏ షాట్ ఆడినా పరుగులు వచ్చాయి. మ్యాచ్ లో రాహుల్, రోహిత్, కోహ్లి కూడా మెరుపు ఇన్నింగ్స్ లు ఆడారు. ప్రత్యర్థి ఆటగాడు మిల్లర్ విధ్వంసక శతకం సాధించాడు. డికాక్ కూడా ధాటిగా ఆడాడు. కానీ ఆదివారం సంచలన ఇన్నింగ్స్ అంటే సూర్యకుమార్దే.