రిమ్స్ లో కొలువుల ఆశ.! డబ్బుల కాజేత

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: కొందరు అక్రమార్కులు అమాయక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా రిమ్స్ ని లక్ష్యంగా చేసుకొని అవుట్ సోర్సింగ్ (పొరుగు సేవల) ద్వారా ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ ఆపరేటర్ ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ. లక్షల్లో వసూలు చేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. అంతా అయ్యాక మోసపోయినట్లు గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. తాజాగా రిమ్స్ లోని డయాలసిస్ కేంద్రంలో ఒక జీఎన్ఎం, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ నియామక పత్రాలను కొందరు సృష్టించి అందజేశారు. నిజంగానే తమకు ఉద్యోగం వచ్చిందన్న సంతోషంతో ఆ అభ్యర్థులు డయాలసిస్ కేంద్రానికి రాగా అవి నకిలీ పత్రాలనీ తేలటం అవాక్కయ్యారు.

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు అక్రమార్కులు రూ. లక్షల్లో నిరుద్యోగుల నుంచి దండుకొని మోసగిస్తున్నారు. రిమ్స్ ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్ నర్సు, సెక్యూరిటీ గార్డు, ల్యాబ్ టెక్నీషియన్, పేషెంట్కేర్, రికార్డు అసిస్టెంట్.. ఇలా పలు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మభ్య పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నా నిరుద్యోగులు మోసం పోతూనే ఉన్నారు. రిమ్స్ ఇలా అక్రమాలకు పాల్పడ్డ ఉద్యోగిని ఒకరిని అధికారులు విధుల నుంచి తొలగించారు. కొందరు రిమ్స్ లో పని చేసే ఉద్యోగులే ఇలాంటి దందాకు తెరలేపారనే ప్రచారం ఉంది.

• వెలుగు చూసిందిలా.!

నిజామాబాద్ నుంచి నకిలీ నియామక పత్రాలు తీసుకున్న అభ్యర్థులు రిమ్స్ డయాలసిస్ కేంద్రానికి వచ్చి ఆ కేంద్రంలో నియామక పత్రాలను అందజేశారు. అయితే అప్పటికే ఆ కేంద్రంలో అన్ని పోస్టులు భర్తీ అయి ఉండటంతో అనుమానం వచ్చిన కేంద్రం ఉద్యోగి డయాలసిస్ కేంద్రం నిర్వహించే అపెక్స్ కిడ్నీ కేర్ సంస్థ ప్రతినిధులను సంప్రదించాడు. వారు నియామక పత్రాలు చూసి నకిలీవని తేల్చారు. అనంతరం వారు ఆ పత్రాలు తీసుకొచ్చిన అభ్యర్థులను విచారించటానికి యత్నించగా వారు సరైన సమాచారం ఇవ్వకుండా అక్కడి నుంచి జారుకున్నారు.

• తప్పుడు నియామకపత్రాలు ఇలా.!

‘అపెక్స్ కిడ్నీ కేర్’ సంస్థ ద్వారా ఆదిలాబాద్ రిమ్స్ లొని డయాలసిస్ కేంద్రంలో ‘కంప్యూటర్ ఆపరేటర్’గా నియమితులైనట్లు జారీ చేసిన నియామక పత్రం ఇది. ఇలానే జీఎన్ఎం ఉద్యోగ నియామక పత్రాన్ని సైతం జారీ చేశారు. ఎవరి ద్వారానో నిజామాబాద్కు చెందిన వ్యక్తి పరిచయమై రిమ్స్ డయాలసిస్ కేంద్రంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అభ్యర్థులను మభ్య పెట్టాడు. అనంతరం నిజామాబాద్ కు పిలిపించి నకిలీ నియామక పత్రాలు అంటగట్టాడు. సదరు అభ్యర్థులు ఇద్దరు రిమ్స్ డయాలసిస్ కేంద్రానికి వెళ్లగా అవి నకిలీ(తప్పుడు) వి అని తేలటంతో వారు అవాక్కయ్యారు. ఈ విషయమై అపెక్స్ కిడ్నీ కేర్ సంస్థ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments (0)
Add Comment