ఉద్యోగాలకు పొంచి ఉన్న ఎన్నికల నోటిఫికేషన్ ప్రమాదం

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్‌: గ్రూప్‌-1తో సహా రద్దయిన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తాజా నోటిఫికేషన్ల ప్రకటన ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ నోటిఫికేషన్లను ఫిబ్రవరి నెల చివరివారంలో ప్రకటించేందుకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సన్నాహాలు చేస్తున్నా.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ఇందుకు అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మ‌ధ్య‌నే టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రిటైర్డ్‌ డీజీపీ, ఐపీఎస్ ఆఫీస‌ర్ మహేందర్‌ రెడ్డి నోటిఫికేషన్ల జారీపైనే ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మహేందర్ రెడ్డితో పాటు మరో ఐదుగురిని సర్వీస్‌ కమిషన్‌ సభ్యులుగా నియమించినా అందులో ఇంకా ఇద్దరు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. రద్దయిన నియామక పరీక్షలు గ్రూప్‌-1 వంటి మిగతా పరీక్షల నోటిఫికేషన్ల జారీకి సంబంధించి నూతన చైర్మన్‌ కమిషన్‌ కార్యదర్శి నుంచి పూర్తి స్థాయి నివేదిక కోరినట్టు తెలుస్తోంది.

• లోక్‌స‌భ‌కు ఫిబ్ర‌వ‌రిలోనే నోటిఫికేష‌న్‌!

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ ఫిబ్రవరి రెండో వారంలో జారీ అయ్యే అవకాశం ఉన్నందున ఈ లోపే నోటిఫికేషన్లు ఇవ్వాలా? లేక ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని నోటిఫికేషన్‌ జారీ అయి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేయాలా? అనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపో తున్నట్టు సమాచారం. ఒకవేళ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి నోటిఫికేషన్ల జారీకి అనుమతి కోరినా.. అంగీకరించకపోతే అనవసర ఇబ్బందులు ఉంటాయ‌న్న‌ భావనతో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే నోటిఫికేషన్ల విషయంలో సర్వీస్‌ కమిషన్‌ మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన కోడ్‌ అమల్లోకి వస్తే ఆ ఎన్నికల ఫలితాలు ప్రకటించేవరకు జాతీయ స్థాయిలో ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం లేదు. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించిన నాటి నుంచి ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. మార్చి నెల చివరిలో లేదా ఏప్రిల్‌ నెలలో ఎన్నికలు జరిగి ఫలితాలను ఆ నెల చివరి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయని, అధికార వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు మే నెలలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయని, నిరుద్యోగ యువత అప్పటివరకు పరీక్షలకు సిద్ధం కావాల్సిందేనని తెలుస్తోంది.

Comments (0)
Add Comment