హస్తం గూటికి కోనప్ప!

ఆంజనేయులు న్యూస్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: భారాస జిల్లా అధ్యక్షుడు, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆ పార్టీ వీడి కాంగ్రెస్ లొ చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైన ఆయన తన ఓటమికి పరోక్షంగా బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారణమని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ-భారాస పొత్తు అంశం తెర మీదకు రావడంతో.. ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నాడని సమాచారం. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోనప్ప.. 2023 శాసనసభ ఎన్నికల్లో సైతం విజయం సాధిస్తారని అంతా అనుకున్నారు. అనూహ్యంగా బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణుమార్ సిర్పూర్ నుంచే బరిలో దిగడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఆయన ఇక్కడే ఉండి దాదాపు 5వేల మంది స్వెరోల సహాయంతో ముమ్మరంగా ప్రచారం చేశారు. కోనప్ప, భారాస ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ తరుణంలో భాజపా అభ్యర్థి పాల్వాయి హరీశ్ బాబు 63 వేల ఓట్లు సాధించగా.. కోనప్పకు 60 వేలు, ప్రవీణ్ కుమార్ కు 43 వేల ఓట్లు వచ్చాయి. మూడు వేల ఓట్ల మెజార్టీతో హరీశ్ బాబు గెలుపొందారు. 40 వేలకు పైగా ఓట్లు సాధించిన ప్రవీణ్ కుమార్ కారణంగానే కోనప్పకు మెజార్టీ తగ్గి ఓటమి పాలయ్యారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
బెజ్జూరు మండలానికి చెందిన నేత హర్షద్ హుస్సేన్ కోనప్పకు మధ్య రాజకీయ విబేధాల నేపథ్యంలో.. పార్టీని వీడి బీఎస్పీలో చేరారు. ఆయన ప్రోద్బలంతోనే ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారనే విషయం ప్రచారంలో ఉంది. ప్రస్తుతం హర్షద్ సైతం కాంగ్రెస్ లొ చేరారు. నియోజకవర్గంలో మరికొందరు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా సమాచారం. నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలో చేరాలా వద్దా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటానని కోనప్ప  పేర్కొన్నారు.

Comments (0)
Add Comment