దేవరగట్టు కర్రల సమరంలో ప్రమాదం.!

మంగళవారం అర్ధరాత్రి దాటాక కర్రలతో తలపడుతున్న భక్తులు

ఆంజనేయులు న్యూస్, హొళగుంద, ఆలూరు గ్రామీణ: దేవరగట్టు కర్రల సమరంలో ప్రమాదం జరిగింది. కర్రల సమరాన్ని చూసేందుకు కొందరు స్థానికులు సమీపంలోని చెట్టు ఎక్కారు. ప్రమాదవశాత్తూ చెట్టు కొమ్మ విరిగిపడి గణేశ్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఈ సమరంలో 100 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఓ చేతిలో కర్ర.. మరో చేతిలో దివిటీలు.. మది నిండా భక్తిభావంతో డిగ్రీర్.. గోపరాక్.. అనే శబ్దాలతో దేవరగట్టు మారుమోగింది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ బన్ని ఉత్సవాన్ని మంగళవారం అర్ధరాత్రి కొనసాగించారు. ఈ నేపథ్యంలో దేవరగట్టులో మరోసారి సంప్రదాయమే గెలిచింది. యథావిధిగా కర్రల సమరం కొనసాగింది.

ఆద్యంతం.. ఉత్కంఠగా

దేవరగట్టుపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామిని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలు భక్తిభావంతో ఆరాధిస్తారు. ఏటా విజయదశమి రోజు అర్ధరాత్రి స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నెరణికి, నెరణికి తండా, కొత్తపేట, సులువాయి, ఆలూరు, బిలేహాలు, విరుపాపురం తదితర గ్రామాల ప్రజలు మంగళవారం అర్ధరాత్రి వేళ కర్రలు చేతపట్టి దేవరగట్టుకు చేరుకున్నారు. దైవకార్యాన్ని అందరం ఐకమత్యంగా జరుపుకొంటామని డోళ్లన బండ వద్ద నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు పాలబాస (ప్రతిజ్ఞ) చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు.. కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పత్తికొండ ఆర్డీవో మోహన్దాస్, డీఎస్పీ శ్రీనివాసరెడ్డికి బండారు ఇచ్చి ఉత్సవానికి అనుమతి తీసుకున్నారు. అనంతరం పెద్దఎత్తున కేకలు వేస్తూ కొండపైకి చేరుకున్నారు. కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామికి మల్లమ్మతో కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపుగా జైత్రయాత్రకు బయల్దేరారు. గట్టుపై నుంచి కిందకు వచ్చి సింహాసన కట్ట వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సమయంలోనే నెరణికి, కొత్తపేట, నెరణికితండా, బిలేహాల్, ఆలూరు, ఎల్లార్తి, సుళువాయి గ్రామాల మధ్య కర్రల సమరం (బన్ని ఉత్సవం) సాగింది. ఈ క్రమంలో కొందరు కర్రలను అటు ఇటు ఊపుతూ విచక్షణ కోల్పోవడంతో ఉత్కంఠ నెలకొంది.

Comments (0)
Add Comment