దిల్లీకి సోయం.. హైదరాబాద్ కు రాథోడ్

భాజపా ఎంపీ అభ్యర్థి ఎవరనేది రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: భాజపా ఎంపీ అభ్యర్థి ఎవరనేది రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాని నరేంద్రమోదీ ఆదిలాబాద్ పర్యటన విజయవంతం కావడం ఆశావహుల్లో మరింత ఆశలు రేకెత్తిస్తోంది. ఆదిలాబాద్ టికెట్ కోసం 42 మంది అభ్యర్థులు దరఖాస్తులు రాగా రాష్ట్ర కమిటీ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, రిమ్స్ ప్రొఫెసర్ డా. సుమలత, భైంసాకు చెందిన రాజేష్ బాబు పేర్లను పరిశీలించింది. సర్వే సైతం చేయించింది. ఈలోగా జిల్లాకే చెందిన భారాస నేత ఒకరు టికెట్ ఇస్తే పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని సంకేతం ఇవ్వడమే కాకుండా భాజపాకే చెందిన ఓ ఎమ్మెల్యే సహకారంతో అంతర్గతంగా ముమ్మర ప్రయత్నాలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలో గురువారం జరగనున్న భాజపా జాతీయ ఎన్నికల కమిటీ(ఎస్ఈసీ) భేటీ కీలకంగా మారింది.  అదిలాబాద్ లో సోమవారం ప్రధానమంత్రి మోదీ సభలో పాల్గొన్న సోయం బాపురావు దిల్లీకి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ హైదరాబాద్ కు హుటాహుటిన మంగళవారం బయలుదేరి వెళ్లడం చర్చనీయాంశమైంది. రిజర్వేషన్లలో ఆదివాసీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలను ప్రత్యేక రైల్లో ఇక్కడి (ఆదిలాబాద్) నుంచే దిల్లీకి తీసుకొచ్చారా? అని సోమవారం విజయ సంకల్పయాత్ర సందర్భంగా ప్రధాని మోదీ సోయం బాపురావుతో ఆరా తీశారు. ప్రధాని రాష్ట్ర పర్యటనలో ఉండగా మంగళవారం దిల్లీ వెళ్లిన సోయం బుధవారం ఆ పార్టీ కీలక నేత సంతోష్ తో భేటీ కానున్నట్లు తెలిసింది. హైదరాబాద్ కు వెళ్లిన మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ మంగళవారం రాష్ట్రంలోని కీలక నేతలతో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అంతర్గతంగా రిమ్స్ ప్రొఫెసర్ డా. సుమలత వివరాలు సేకరించడం ఆసక్తిగా మారింది. ఓ భారాస నేత మంగళవారం భాజపా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నా ఎలాంటి హామీ లభించనట్లు తెలిసింది.

Comments (0)
Add Comment