పుష్కరాలలో భక్తుల సౌకర్యార్థం పూర్తిస్థాయి ఏర్పాట్లు

రాష్ట్ర మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి..

మంచిర్యాల జిల్లా: ప్రాణహిత నది పుష్కరాలు ఈనెల 24వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పరిధిలో కోటపల్లి మండలం అర్జునగుట్టలో ప్రజల సౌకర్యార్థం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం అర్జున గుట్ట లోని ప్రాణహిత నది తీరంలో ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి, శాసనమండలి సభ్యులు దండే విఠల్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి పుష్కరుడికి పూజలు చేసి, పుణ్య స్నానం ఆచరించి, నదీ హారతి ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ‌తంలో గోదావ‌రి, కృష్ణ పుష్కరాల్లో, ఇప్పుడు ప్రాణ‌హిత‌ పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించటం మహాభాగ్యంగా భావిస్తున్నాని, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గోదావ‌రి, కృష్ణ పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి విజ‌య‌వంతంగా నిర్వహించడం జరిగిందని, ఇప్పుడు ప్రాణహిత పుష్కరాలను నిర్వహించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఈ పుష్కరాలకు తెలంగాణ సహా ఇత‌ర‌ రాష్ట్రాల‌ నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వ‌చ్చే అవ‌కాశం ఉందని, ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, వివిధ శాఖల అధికారుల‌ను స‌మ‌న్వ‌యం చేస్తూ భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పుష్కరాల ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారుల పనితీరు అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment